ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరో వరం

బుధవారం, 7 అక్టోబరు 2020 (06:50 IST)
పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, అభ్యాసనలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
 
 అంతే కాకుండా పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఖర్చుల కోసం పేదింటి అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాల నుంచి వారికి విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో ‘డ్రాప్‌ అవుట్‌‘ లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా ‘జగనన్న విద్యాకానుక’ ను ప్రభుత్వం అమలు చేస్తోంది.
 
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, పునాదిపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఈ కార్యక్రమాన్ని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారు.
 
ఏమిటి ‘జగనన్న విద్యా కానుక?’:
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్కూల్‌ కిట్‌లు అందజేయనున్నారు.
 
కిట్‌లో ఏముంటాయి?:
జగనన్న విద్యా కానుక కింద పిల్లలకు అందజేసే కిట్‌లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్స్‌, ఒక స్కూల్‌ బాగ్‌ ఉంటాయి.
ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఆ కిట్లు పంపిణీ చేయనున్నారు. దీంతో పాటు పిల్లలకిస్తున్న యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా విడుదల చేస్తారు. 
 
ఎంత మందికి? ఎంత వ్యయం?:
రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థినీ, విద్యార్దులకు  దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్‌ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు.
 
పారదర్శక సేకరణ
జగనన్న విద్యా కానుకలో పిల్లలకు అందించే వస్తువులు, బుక్స్, యనిఫామ్‌ క్లాత్‌ను ఎక్కడా అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్, ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సేకరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా, బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్కూలు కిట్లు ఇస్తున్న మొట్టమొదటి, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు