ఈ దిశ దేశానికి దిశానిర్దేశం చేసింది : పుష్పశ్రీవాణి

శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:27 IST)
ఈ రోజు ఈ శాసనసభలో ఇంతగొప్ప మహిళా భద్రతా చట్టాన్ని తీసుకొచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున, ముఖ్యంగా మహిళలందరి తరపున మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. 
 
తొలి అసెంబ్లీ సమావేశాల నుంచి ఎన్నో చారిత్రాత్మక చట్టాలను ఈ సభలో చేస్తున్నందుకు సభాపతిగా ఉన్న మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ చట్టాన్ని ఒక డిప్యూటీ సీఎంగానే కాకుండా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళగా నా సంపూర్ణ మద్థతుని తెలుపుతున్నాను. దేశం మొత్తం దిశా ఘటన తర్వాత స్టేట్‌మెంట్లకే పరిమితమైపోతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం దేశానికే దిశా, నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నాను. ఇంతగొప్ప మహిళా పక్షపాతి అయినటువంటి జగన్మోహన్‌ రెడ్డి గారి మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా గిరిజనమహిళైన నాకు అవకాశమిచ్చినందుకు గర్వపడుతున్నాను.
నా జీవితాంతం జగన్మోహన్‌రెడ్డి గారికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 
 
ఈ చట్టం మాలో ఒక నమ్మకాన్ని కలిగించింది. నిత్యం నరకంలో నడిచే యావత్‌ మహిళా లోకానికి నమ్మకం కలిగించింది. ఆ నమ్మకం ఎలాంటిదంటే ఈ చట్టం వలన న్యాయస్ధానంలో న్యాయదేవత కళ్లకు గంతలు తెరుచుకుని ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపైనా ఆదిపరాశక్తిగా మారి శిక్షిస్తుందన్న నమ్మకం కలిగింది. హింసించే మానవ మృగాలను వెంటపడి వేటాడుతాయన్న నమ్మకం కలిగించింది. ఈ చట్టం అనాదిగా అల్లరిమూకలు, ఆకతాయిలు, అరాచక శక్తులు రాక్షసక్రీడకు బలైపోతున్న మహిళల గుండె మంటల్ని చల్లార్చి గుండె ధైర్యాన్ని నింపిందన్న నమ్మకాన్ని కలిగించింది. స్త్రీ అంటే అవసరాలు తీర్చే యంత్రంగానో, స్త్రీ అంటే అవమానాల కోసం పుట్టే ప్రాణంగానో, స్త్రీ అంటే రేపిస్టులకు ప్రయోగశాలగానో భావించే ఈ సమాజంలో ఆ స్త్రీకి ఒక రక్షణ కవచంగా ఈ చట్టం ఒకటి వచ్చిందన్న నమ్మకం ఈ రోజు కలిగింది. నిన్నటి వరకు ఈ దేశంలోకానీ, రాష్ట్రంలో కానీ మహిళల మాన సిక స్దితి చాలా దయనీయంగా ఉండేది.

దిశ అత్యాచారం, హత్య చూసిన తర్వాత ఒక్కసారిగా మహిళల మానసిక సంఘర్షణ రోడ్డుకెక్కింది. అధ్యక్షా తండ్రి వయస్సులో ఉన్నవాళ్లు, తమ్ముడిలా చూసినోళ్లు, స్నేహితుడిలా మెలిగినోళ్లు, పాఠాలు చెప్పే లెక్టరర్లు, గుర్తు తెలియని వాళ్లు ఇలా ఎవరు బడితే వాళ్లు ఆడవాళ్ల జీవితాలను అడవి మృగాళ్లాగా దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు. మనమేం చేసినా ఎవడూ అడిగేవాడు లేడులే అన్న పొగరుతో రెచ్చిపోతున్నారు.

కానీ ఈ రోజు అలాంటి వాళ్లకు బలైపోతున్న ఆడవాళ్ల తరపున అడిగే చట్టం ఒకటి వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ చట్టాన్ని అమలు జేసే దమ్మున్న ముఖ్యమంత్రి మన వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్న నమ్మకం యావత్‌ మహిళా లోకానికి కలిగింది. నిన్నటివరకు నాకే కాదు అధ్యక్షా ఈ దేశంలోని ఏ మహిళకూ కూడా ఆ నమ్మకం లేనటువంటి పరిస్ధితి ఉంది. ఇప్పటివరకు మనకు అనేక చట్టాలు ఉన్నాయి, నిర్భయ చట్టం, ఫోక్సో చట్టం, వరకట్న వేధింపులు చట్టం, ఇండియ్‌ పీనల్‌ కోడ్, పటిష్టమైన న్యాయవ్యవస్ధ, గొప్ప పోలీసు వ్యవస్ధ అన్నీ ఉన్నాయి. 
 
కానీ దిశ సంఘటన జరిగిన తర్వాత ఆ చట్టాలు శిక్షిస్తాయన్న నమ్మకం ఎవరికీ కలగలేదు. అందుకే దిశను చంపిన మృగాలు దిక్కులేని కుక్క చావు చావాలని చెప్పి ఈ దేశంలో ప్రతీ మహిళా  గొంతెత్తి గుంyð లవిసేలా నినదించింది
దిశను దారుణంగా చంపిన ఆ నలుగురూ ఎన్‌కౌంటర్‌ అయితే శెభాష్‌ పోలీస్‌ అని ప్రశంసించడం జరిగింది. చట్టమంటే భద్రత, భయం రెండూ కలిగించాలి, అలా కానప్పుడు అది బలవంతులకు చుట్టం కానీ బలహీనులకు న్యాయం చేసే చట్టం అవదు. అందుకే ఈ పరిస్ధితుల్లో మార్పు తెచ్చేందుకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారు ఒక గొప్ప చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 
 
అధ్యక్షా పాదయాత్ర సమయంలో నేను గానీ, మా పార్టీ నాయకులు గానీ రాష్ట్రంలో ప్రతీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గానీ ఒక మాట చెప్పేవాళ్లు, అదేంటంటే అన్నొస్తున్నాడు మనకు అండగా నిలుస్తాడని చెప్పేవాళ్లం. ఈ రోజు ఈ చట్టం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ నిజంగానే మా అన్న వచ్చాడన్న విశ్వాసం ప్రతీ ఒక్కరిలోనూ కలిగింది.  మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారు ఇద్దరు ఆడబిడ్డల తండ్రిగా చలించిపోయినప్పుడు మహిళలుగా ఇక్కడున్న నేను, మా మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఆడబిడ్డకు  ఇన్నాళ్లకు మా కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడన్న నమ్మకం కలిగింది. ఆ రోజు జగన్మోహన్‌ రెడ్డి గారు మాట్లాడిన టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిలో ఒక ఆడకూతురుకు అన్యాయం జరిగితే స్పందించే ఒక తండ్రి కనిపించాడు. 
 
ఒక చెల్లిపై అఘాయిత్యం జరిగితే స్పందించే ఒక అన్న కనిపించాడు. ఒక అక్కకు అఘాయిత్యం జరిగితే స్పందించే తమ్ముడు కనిపించాడు. అధ్యక్షా ఈ రోజు చందమామలో మనం అందాన్ని చూస్తాం, వెన్నెలను చూస్తాం. కొంతమంది మాత్రం మచ్చనే చూస్తారు అధ్యక్షా... గౌరవ ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడుగారికి ఆ రోజు ఆయన స్పందించిన తీరులో టోల్‌ గేటు మాత్రమే కనిపించింది. అది చందమామలో ఉండే మచ్చ కాదు, వాళ్ల మనసులో ఉండే మచ్చ. ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ జగన్మోహన్‌ రెడ్డి గారు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా, ఆయన తల్లి విజయమ్మ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన బిడ్డ తన భర్త వైయస్సార్‌ అంత గొప్పవాడయ్యాడు అన్న ఉద్వేగంతో ఆ రోజు విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టుకునారు.

అమ్మ కన్నీళ్లు పెడితే ఒక్క క్షణం కూడా ఆగలేపోయిన జగనన్న ఆ రోజు ఆమె కన్నీళ్లు తుడిచి ఓదార్చిన సందర్భం తలుచుకుంటే మనందరి కళ్లల్లో ఈ రోజు కూడా కన్నీళ్లు సుడుగు తిరుగుతున్నాయి. తన తల్లి కన్నీళ్లు పెడితే ఎలా స్పందించి కన్నీళ్లు తుడిచారో, ఈ రోజు ఈ రాష్ట్రలో ఏ తల్లి కన్నీళ్లు పెట్టినా అలాగే స్పందిస్తారన్న సమ్మకం మాకు జగనన్న ఈ చట్టం ద్వారా కలిగించారు. అమ్మలోని మొదటి అక్షరం నాన్నలోని రెండో అక్షరం కలిపితే అన్న అవుతుంది...  విజయమ్మగారిలో మమకారం, వైయస్సార్‌ గారిలో మానవత్వం రెండూ కలిపితే మా జగనన్న అవుతారు. 
 
ఈ రాష్ట్రంలో మహిళలందరికీ అన్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కన్నీళ్లు కార్చే ప్రతీ ఆడబిడ్డకు జగనన్న అండగా ఉంటాడన్న నమ్మకం ఈ చట్టం చూస్తే అర్దమవుతుంది. ఎందుకు ఇంత నమ్మకం కలిగిందంటే అధ్యక్షా.... మనరాష్ట్రంలో ఈ చట్టం చేయమని ఏ ప్రతిపక్షం డిమాండ్‌ చేయలేదు. ఏ ప్రజా సంఘమూ నిలదీయలేదు, ఏ మహిళా సంఘమూ నిందించలేదు, ఏ మహిళా రోడ్డెక్కలేదు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారు ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలను చూసి, చలించిపోయి క్రూర మృగాలు మనుషులు మధ్య తిరగడం భావ్యం కాదని భావించి ఈ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ చట్టం మహిళలకు నమ్మకాన్నే కాదు, మృగాళ్లకు భయాన్ని కూడా కలిగిస్తుంది. ఆడవాళ్లుపై అత్యాచారం, హత్య జరిగినట్లు తేలితే మొదటి వారంలోనే కేసు విచార ణ, మూడో వారాల్లోనే  శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. అది కూడా మరణశిక్ష. అదే విధంగా ఈ రోజు సోషల్‌ మీడియాలో మహిళలు పై దారుణంగా పోస్టింగ్‌లు పెట్టేవారికి మొదటిసారిగా రెండేళ్ల శిక్ష, రెండోసారి నాలుగేళ్లు శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించారు. అదే విధంగా ప్రతీ జిల్లాలోనూ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. 
 
అధ్యక్షా మొన్న మహిళా భద్రతపై చర్చను అడ్డుకున్న చంద్రబాబు నాయుడు గారని ఈ  సందర్భంగా ప్రశ్నిస్తున్నాం... 
మీ నలభై యేళ్ల రాజకీయ జీవితంలో 14 యేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏనాడైనా మహిళల భద్రత కోసం ఇంత పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచన కూడా వాళ్లకు రాలేదు. ఈ రోజు మహిళల భద్రత మీద తీసుకొచ్చిన చట్టం మీద స్పందించడానికి కూడా ఇష్టం లేక వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారంటే, వీళ్లకి మహిళ భద్రత మీద ఎంత చిత్తశుద్ధి ఉందన్నది ఈ సందర్భంగానే తెలుస్తుంది. వీళ్ల హయామంలో మహిళలపై ఎన్నో అకృత్యాలు, అఘాయిత్యాలు జరిగాయి. అందుకు నేనే ఉదాహరణ.. ఎన్నికల పోలింగ్‌ రోజు వాళ్ల పార్టీకి సంబధించిన ఎమ్మెల్సీ గారు సమక్షంలో టీడీపీ జెడ్పీటీసీ భర్త, ఎంపీటీసీ భర్త అక్కడున్నటుంటి తెలుగుదేశం నాయకులంతా నా మీద దాడి చేసి, చట్టంలో లూప్‌ హోల్స్‌ను అడ్డం పెట్టుకుని కనీసం ఛార్జ్‌ షీటు కూడా వేయకపోతే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఎవిడెన్స్‌లు సమర్పించి అప్పుడు జూన్, జూలై నెలలో ఛార్జ్‌ షీటు వేశారంటే మహిళలకు వీళ్లిచ్చే భద్రత ఏ రకంగా ఉందో అర్ధమవుతుంది. 
 
చివరగా ఒక్క మాట ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు  కొలువుదీరుతారు అంటారు. నేను ఘంటాపథంగా చెపుతున్నాను...ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ  రాష్ట్రంలో మహిళలు గౌరవించబడతారు. జగన్మోహన్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఈ రాష్ట్రంలో దేవతలు కొలువుదీరుతారన్న నమ్మకం వచ్చింది. దిశా ఘటన తర్వాత ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశానికే దిశా, నిర్దేశంగా నిలిచిన ముఖ్యమంత్రిగారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక మహిళా మంత్రిగా నా జీవితంలో ఇక ఎప్పటికీ  ఇంతకంటే గొప్ప చట్టం వస్తుందని నేననుకోవడం లేదు. అలాంటి మహిళా భద్రతా చట్టాన్ని నేను సంపూర్ణంగా  బలపరస్తున్నాను. యావత్‌ మహిళా లోకం తరపున జగన్మోహన్‌ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు