నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... చంద్రబాబు అరెస్టుపైనే అందరి దృష్టి

గురువారం, 21 సెప్టెంబరు 2023 (09:34 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే లక్ష్యంగా జరుగనున్నాయి. సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేయడమే ప్రధాన అజెండాగా అధికారపక్షం ఒక పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో చంద్రబాబును ఆరెస్టు చేశాక, రాష్ట్రంలో, దేశంలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఆయన ఆరెస్టును వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 
 
మహిళలు.. మరీ ముఖ్యంగా విద్యావంతులైన యువత రోడ్లపైకి రావడం తెలుగుదేశం పార్టీకి మనోధైరాన్ని ఇస్తుంటే.. పాలకపక్షాన్ని రోజురోజుకూ రాజకీయంగా ఇరకాటంలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో శాసనసభ వేదికగా. ఆయనపై మరింత బురదజల్లేందుకు వైసీపీ వ్యూహరచన చేసింది. సమావేశాలు జరిగే ఐదు రోజులూ మంత్రులతో పాటు తమ పార్టీ శాసనసభ్యులూ ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేసేలా వ్యూహరచన చేశారు. చంద్రబాబు నిధులు దుర్వినియోగం చేశారని సీఎం జగన్ సైతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. టీడీపీ అధినేత తప్పులన్నీ బయపెడతామని ఒక మంత్రి తెలిపారు.
 
గురువారం అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. ఉదయం సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలో, ఆజెండా ఏమిటో నిర్ణయిస్తారు. కాగా.. గురు, శుక్రవారాల్లో సభ సమావేశమవుతుందని... శని, ఆదివారాలు సెలవని.. తిరిగి సోమ, మంగళ, బుధవారాల్లో సమావేశాలు జరుగుతాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు