ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం వచ్చింది. గుంటూరు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు పెదకాకాని మండలం కొప్పురావూరు సమీపంలో ఆదివారం తనిఖీలు చేశారు.
తెలంగాణ నుంచి మద్యంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న గుడివాక, మత్సా సురేష్‌ను అరెస్టు చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో గుంటూరులోని రామాంజినేయులు బినామీ నరేష్‌తో పాటు, గంటా హరీష్‌లను అరెస్టు చేసి 20 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మద్యం అక్రమ రవాణా కేసులో అరెస్టు అయిన గుడివాక రామాంజనేయులుపై బీజేపీ రాష్ట్ర విభాగం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రామాంజనేయులును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. గుడివాకకు ఈ విషయాన్ని బీజేపీ లేఖ ద్వారా వెల్లడించింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యవహరించారని ఆ లేఖలో పేర్కొన్నారు.