ఏపీ సచివాలయంలో జర్మనీ స్మార్ట్ సైకిళ్లు, బైకులు

బుధవారం, 31 జనవరి 2018 (20:58 IST)
అమరావతి: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో కూడా స్మార్ట్ బైకులు ప్రవేశపెట్టాలని ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్ వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయం ప్రాంగణం 2వ బ్లాక్ ఎదురుగా బుధవారం ఉదయం ఆయన స్మార్ట్ బైక్ స్టాండ్, స్మార్ట్ బైకులను ప్రారంభించారు. స్మార్ట్ కార్డ్ ద్వారా డిజిటల్ తాళం తీసే పద్ధతి, బైకుని ఉపయోగించే విధానాన్ని నిర్వాహకులు సీఎంకు వివరించారు. సచివాలయం వద్ద మూడు స్టాండులు, 24 స్మార్ట్ బైకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బైకుకు ఉన్న బుట్టలో హెల్మెట్ కూడా ఉంది. ఆంధ్రా బ్యాంకువారి సౌజన్యతంలో ఈ బైకులు ఏర్పాటు చేసినట్లు, ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సీఎంకు చెప్పారు. 
 
అత్యంత ఆధునికమైన, అత్యుత్తమమైన ఈ సైకిళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నట్లు, ప్రభుత్వం అనుమతిస్తే త్వరలో అమరావతిలో అసెంబ్లింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు ఆలిండియా బైసైకిలింగ్ ఫెడరేషన్ చైర్మన్ డివి మనోహర్ సీఎంకు చెప్పారు. ఇంతకుముందు ఎక్కడా లేనివిధంగా ఈ బైక్ స్టాండ్ డిజైన్ చేసినట్లు తెలిపారు. మిగిలిన నగరాలలో కూడా ప్రవేశపెడతామని చెప్పారు. సైకిల్ రేసులు కూడా నిర్వహించమని సీఎం ఆయనకు సలహా ఇచ్చారు. బైక్ స్టాండ్ నిర్మాణం చూసి సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాండ్ చుట్టూ మొక్కలు పెంచి పచ్చదనం నింపి, ఆకర్షణీయంగా తయారుచేసి, సందర్శకులు ఇక్కడ కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేయమని చెప్పారు. 
 
అలాగే ఇక్కడ సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేసి ఏసీకి విద్యుత్ వాహనాలకు వినియోగించే ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు. విజయవాడ-గుంటూరు మధ్య కూడా ఇటువంటి సైకిళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించమన్నారు. స్మార్ట్ బైక్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించమని కమిషనర్ శ్రీధర్‌కు సీఎం చెప్పారు. ఆ తరువాత సీఎం స్వయంగా సైకిల్ తొక్కుతూ 1వ బ్లాక్ లోని తన కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎనర్జీ, మౌలికసదుపాయలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
 
స్మార్ట్ బైక్ ఉపయోగించే విధానం
సచివాలయం బయట బస్టాండ్ వద్ద, లోపల 5వ బ్లాక్, 2వ బ్లాక్ వద్ద స్మార్ట్ బైక్ స్టాండ్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడుచోట్ల ఎక్కడైనా బైక్ తీసుకోవచ్చని, ఎక్కడైనా పార్క్ చేయవచ్చని తెలిపారు. పేరు నమోదు చేయించుకున్నవారికి సభ్యత్వ స్మార్ట్ కార్డు ఇస్తారని, ఆ కార్డు ద్వారా బైక్ డిజిటల్ తాళం తీయవచ్చని వివరించారు. యాప్ ద్వారా కూడా బైక్ తాళం తీయవచ్చని తెలిపారు. బైక్‌ని తీసుకొని, ఉపయోగించుకునే వివరాలు స్టాండ్ వద్ద శాశ్వతంగా ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం ఈ బైకులకు ఉచితంగానే వినియోగించుకోవచ్చిని తెలిపారు. దేశంలోని ఇతర  ప్రాంతాల్లో రెండు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ఛార్జి వసూలు చేస్తారని వివరించారు. నగరం విస్తరించిన తరువాత ఈ బైకుల వినియోగం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
 
ఆంధ్రాబ్యాంక్ రూ.30 లక్షల మంజూరు
అమరావతిలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ బైక్ ప్రాజెక్టుకు అయిన ఖర్చు మొత్తం రూ.30 లక్షలు ఆంధ్రాబ్యాంక్ ఇచ్చినట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. బ్యాంక్ ఏజీఎం ఎం.విజయప్రతాప్ చొరవతో నిధులు విడుదల చేసిన జీఎం కెవిఎస్పీ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు