కేటీఆర్‌కు అంత పేరొస్తే నాకెంత రావాలీ.. అందుకే ఐటీ శాఖ నాకే కావాలీ: ఆరున్నొక్క రాగంలో లోకేశ్

శనివారం, 4 మార్చి 2017 (02:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ బాబు మన దేశ వారసత్వ రాజకీయాల పుణ్యమా అని ఏ అనుభవమూ లేకున్నా ఏకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిపోయారు. తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయిన పార్టీకి లోకేశ్ జాతీయ కార్యదర్శి. దానికి తోడు ఇప్పుడు తండ్రి వత్తాసుతో మొన్ననే ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చేసింది. ఇక మంత్రి పదవి ఎంతసేపు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరిగి సజావుగా ముగిసిన మరుక్షణం ఆ మంత్రి పదవి కూడా మెడలో వచ్చి పడటం ఖాయం. 
ఇదంతా బాగానే ఉంది కాని అసలు విషయం ఏమిటంటే లోకేశ్ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ ప్రభలతో తన్ను తాను పోల్చుకోవడమే. కేసీఆర్ తనయుడిగా కంటే కేటీఆర్ పాలనా దక్షుడిగా, వ్యవహారాలు చక్కబెట్టే నేర్పరిగా తన సమర్థతను ఇప్పటికే నిరూపించుకున్నారు. ఫలితంగా కేటీఆర్ పేరు తెలంగాణను దాటి, జాతీయ స్థాయిని దాటి, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది.  ప్రపంచ ఐటీ దిగ్గజాలతో సంప్రదింపులు జరిపి తెలంగాణకు లబ్ధి చేకూరే పనులను చేపట్టడంలో కేటీఆర్ ఎంతో ముందుకు పోయారు. ఇప్పుడు ఆ కేటీఆర్ ప్రాభవం చూస్తుంటేనే మన లోకేశ్ బాబుకు కన్ను కుడుతోందట.
 
తనను మంత్రివర్గంలోకి తీసుకుంటే పరిశ్రమల శాఖతో పాటు ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖలు మాత్రం తప్పనిసరిగా తనకు ఉండాలని లోకేశ్ కోరుతున్నారని సమాచారం. ఐటీ శాఖ కారణంగానే తెలంగాణలో కేటీఆర్ ఇమేజీ పెంచుకుంటున్నారని, ఆ కారణంగానే లోకేశ్ సైతం పరిశ్రమలతో పాటు ఐటీ శాఖను అప్పగించాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఐటీ శాఖ పల్లె రఘునాధరెడ్డి నిర్వహిస్తున్నారు. మంత్రులు కొందరి శాఖలను మార్చడం, మరికొందరికి ఉద్వాసన పలకడానికి సంబంధించి గత ఆరు నెలలుగా కసరత్తు జరుగుతోంది. దానికి తగినట్టుగానే గత కొంతకాలంగా తొలగించాలని భావిస్తున్న మంత్రుల నెలవారీ నివేదికల్లో తక్కువ మార్కులు కూడా ఇచ్చారని విశ్వసనీయ సమాచారం.
 
కానీ కేటీఆర్‌తో కీర్తి ప్రాభవాల్లోనే కాదు. తెలుగుదేశం పార్టీకి జవజీవాలు సమకూర్చడంలో తన వంతు ప్రభావం వేయడం లోకేశ్‌కు అత్యంత ముఖ్యమైన విషయంగా ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీని కేటీఆర్ ఒంటిచేత్తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు కట్టబెడితే హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిన ఘటనకు లోకేశ్ సాక్షీభూతుడై నిలిచాడు. గుర్తింపు అంటే రాజకీయంగా, సంస్థాగతంగా పార్టీని నిలపడం, బలోపేతం చేయడం, కాసిన్ని సీట్లు పార్టీకి కట్టబెట్టడంలో చమటోడ్చడమే కానీ కేటీఆర్ తోనో మరొక వారసుడితో పోటీ పడటం కాదని లోకేశ్ ఎంతత్వరగా గ్రహిస్తే తనకు అంత మంచిది. 
 
త్వరలోనే మంత్రిపదవి చేపట్టబోతున్న లోకేశ్‌కు శుభాభినందనలు తెలుపుతూనే తను చేయాల్సిన అసలు కర్తవ్యంపై దృష్టి నిలుపుతారని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి