ఠంచనుగా వేకువజాము 4 గంటలకే లేచి ప్రిపేర్ అవుతా : సీఎం జగన్

బుధవారం, 3 జులై 2019 (13:18 IST)
ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు రెండు రోజుల శిక్షణను బుధవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఇందులో సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి రూల్స్ గురించి తెలుసుకోవాలన్నారు.

అంతేకాదు ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలని భావిస్తున్నారో ఆ సబ్జెక్టు మీద అవగాహనను పెంచుకోవాలని ఆయన సభ్యులకు సూచించారు. బహిరంగ సభల్లో గొప్ప స్పీకర్‌గా ఉన్న వ్యక్తులు కూడ అసెంబ్లీలో ఒక్కో సమయంలో ఫెయిల్ అయిన సందర్భాలు కూడ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 
 
అసెంబ్లీలో చర్చలో పాల్గొనే సమయంలో తాను ఉదయమే నాలుగు గంటలకే ఆ సబ్జెక్టు మీద ప్రిపేర్ అయినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఆయా సబ్జెక్టు మీద ప్రిపేర్ అయితేనే ఇతర సభ్యులు అడ్డు తగిలినా.. ప్రశ్నించినా కూడ వాటికి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. 
 
అంతకుముందు ఈ శిక్షణా తరగతులను ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, శాసనసభలో చర్చలు అర్థవంతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు. శాసనసభలో ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి శాసనసభ్యులుగా పేరు తెచ్చుకొనేందుకు సభ ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. కాగా, ఈ శిక్షణ తరగతులకు టీడీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు