ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లాలనుకున్నప్పటికీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ల అపాయింట్‌మెంట్లు ఇవ్వనట్టు సమాచారం. తొలుత అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైనప్పటికీ.. ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారట. దీంతో సీఎం జగన్ పర్యటన రద్దు అయింది.
కేంద్ర మంత్రులు బిజీగా ఉన్నందున ముఖ్యమంత్రి జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ ఆదివారం సాయంత్రం వైసీపీ వర్గాలు వెల్లడించాయి. నిజానికి... సోమవారం అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఖరారైనట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, సమయం ఇవ్వడం కుదరదని ఆదివారం సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో... కనీసం గురువారమైనా అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కోరాయి. దీనిపై హోంశాఖ స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి.
మరోవైపు, సీఎం జగన్‌కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్‌తో సహా ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్ లభించేలా వైసీపీ ఎంపీలు నేరుగా ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఎంపీతోపాటు... మరికొందరు సోమవారం ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిసింది. వీరు నేరుగా ఆయా కేంద్ర మంత్రుల కార్యాలయాలకు వెళ్లి... అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరనున్నట్లు ప్రచారం సాగుతోంది.