భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ సర్కారు!!

గురువారం, 14 మే 2020 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టింది. నవరత్న హామీల అమలుకోసం అవసరమైన నిధుల సమీకరణంలో భాగంగా, ఈ భూములను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి విక్రయించనుంది. 
 
తొలి విడతలో విశాఖపట్టణం, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న భూమిని వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న ఈ భూముల విక్రయానికి సంబంధించిన వేలం పాట ప్రారంభంకానుంది. ఈ భూములు అమ్మడం వల్ల వచ్చే నిధులను నవరత్నాలు, నాడు - నేడు వంటి కార్యక్రమాల అమలుకు వెచ్చించనుంది. 
 
ఈ వేలం ప్రక్రియను బిల్డ్ ఏపీ మిషన్ చేపట్టబోతోంది. ఈ సందర్భంగా బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ, వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. వేలం వేయాలనుకున్న తొమ్మిది స్థలాలకు రిజర్వ్ ధరగా రూ.208.62 కోట్లను నిర్ణయించినట్టు చెప్పారు. ధరావతు కింద 10 శాతం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 
తొలి విడతలో విక్రయించనున్న భూముల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు - 6.07 ఎకరాలు, శ్రీనగర్ కాలనీ - 5.44 ఎకరాలు, మెయిన్ బీటీ రోడ్డు - 1.72 ఎకరాలు చొప్పున వేలం వేస్తారు. 
 
అలాగే, విశాఖపట్టణం జిల్లాలో చిన గడ్లీ - 1 ఎకరం, చిన గడ్లీ - 75 సెంట్లు, ఆగనంపూడి - 50 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 35 సెంట్లు, ఫకీర్ టకియా ఎస్ఈజెడ్ - 1.93 ఎకరాలు, ఫకీర్ టకియా ఎసీఈజెడ్ - 1.04 ఎకరాలు చొప్పున వేలం వేసి విక్రయించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు