ఈ పాదయాత్రలో 20 మంది పాల్గొంటారని చెప్పారని, ఒకవేళ ఈ సంఖ్య పెరిగితే ఒక్కో బృందంలో 200 మంది చొప్పున వేర్వేరుగా యాత్ర చేపడుతాయని చెప్పినప్పటికీ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొన్నారు. పైగా, యాత్ర సాగే జిల్లాల పోలీసుల నుంచి నుంచి అభిప్రాయాలు కూడా సేకరించిన మీదటే ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు డీజీపీ అందులో పేర్కొన్నారు.
గత యేడాది అమరావతి నుంచి తిరుపతి వరకు రైతులు చేపట్టిన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా తాము పెట్టిన షరతులన్నింటినీ ఉల్లంఘించారని గుర్తు చేసిన డీజీపీ.. ఈ పాదయాత్రా సమయంలో వివిధ జిల్లాల్లో మొత్తం 71 మందిపై క్రిమినల్ కేసులు నమోదైవున్నాయని, ఇందులో రెండు కేసుల్లో శిక్ష కూడా పడిందని ఆయన గుర్తుచేశారు.
పైగా, ఈ నెల 12వ తేదీన చేపట్టనున్న పాదయాత్రలో ఎంతమంది రైతులు పాల్గొంటారన్న విషయంపై రైతుల్లోనే స్పష్టత లేదని, పైగా ఎవరు వస్తారో కూడా తెలియనపుడు వారిని గుర్తించడం, పర్యవేక్షించడం అధికారులకు కష్టమవుతుందని, అందుకనే అనుమతి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి భద్రత కల్పిచండం సాధ్యం కాదన్నారు.
ఇటీవల ఉద్రిక్తంగా మారిన కోనసీమ ప్రాంతం మీదుగా యాత్ర జరుగుతుందని, ఆ సమయంలో అక్కడ చిన్నపాటి గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారి శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ యాత్రకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.