దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. సస్పెండైన దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్యక్తిగత జీవితంతో తమకు సంబంధంలేదన్నారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... అయితే, అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు. ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నివేదించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దల అండతో నివేదికలను తొక్కి, అడ్డగోలుగా ఆమె వ్యవహరించారని మంత్రి ఆనం ఆరోపించారు. ఇపుడు వీటన్నింటినీ వెలుగులోకి తీస్తున్నట్టు చెప్పారు.
కాగా, గతంలో విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి పని చేశారు. ఆమె హయాంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించి, విచారణ జరిపారని వెల్లడించారు. ఈ అవకతవకల నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేసిందన్నారు. ఆమె తప్పు చేసినట్లుగా నివేదికలు చెప్పినప్పటికీ... ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వాటిని తొక్కిపెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఆ నివేదికలను బహిర్గతం చేయలేదన్నారు.
విశాఖలో ఆరేడు దేవస్థానాలలో విచారణ జరిపితే అవకతవకలు ఉన్నట్లుగా వెల్లడైందన్నారు. అయినప్పటికీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక నివేదికలు పరిశీలించి ఆమెపై చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మొదట ఆమెపై ఇన్ని ఆరోపణలు రాలేదన్నారు. మొదట ఆమెను సస్పెండ్ చేశామని, ఆ తర్వాత ఎన్నో విషయాలు వెలుగు చూశాయన్నారు.
తాము ఆలయానికి భూములు ఇస్తే వాటిని అమ్ముకున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. శాంతి పని చేసిన ఆలయాల్లో జరిగిన అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. నివేదిక వచ్చాక శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇకపోతే, శాంతిని సస్పెండ్ చేస్తూ వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. శాంతి వ్యక్తిగత జీవితంతో... ప్రభుత్వానికి, తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదన్నారు.