వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు!!

వరుణ్

ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (14:32 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో ఈ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. కేసు విచారణను నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో పవన్ కల్యాణ్ మార్చి 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు జారీ చేశారు. 
 
గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్‌‍లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపైనా బురదజల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్ కళ్యాణఅ‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి.పవన్ కుమార్‌తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు