ఒక ఉపాధ్యాయుడిపై అత్యాచారం కేసు పెట్టాలంటూ ఓ మహిళపై ఏపీలోని అధికార వైకాపా నేతలు తీవ్రమైన ఒత్తిడి చేశారు. గత రెండేళ్లుగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె అంగీకరించలేదు. దీంతో కక్ష పెంచుకుని తన భర్తతో కలిసి శిరోముండన దురాగతానికి పాల్పడ్డారంటూ బోరున విలపిస్తూ చెప్పింది. ఈ దారుణ ఘటన సీతానగరం మండలం పెదకొండేపూడిలో ఈ నెల 2వ తేదీన భర్త అభిరామ్ చేతిలో శిరోముండనానికి గురైన షేక్ ఆషా తన ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియో వైరల్ అయ్యింది.
'చినకొండేపూడికి చెందిన వైకాపా నాయకులు నన్ను పిచ్చిదాన్ని చేసి నా భర్తతోనే చంపేయాలనుకున్నారు. భర్త, అత్తమామలను వారే రెచ్చగొట్టారు. నా భర్త ఆస్తి నాకు, నా ఐదేళ్ల బిడ్డకు దక్కకుండా చేసింది కూడా ఇద్దరు వైకాపా నాయకులే. నా భర్త రాంబాబు నాపై దాడిచేసే సమయంలో అత్తమామలతో పాటు ఆడపడచు చినకొండేపూడిలోని వైకాపా నాయకుడి ఇంట్లోనే ఉన్నారు. ఒకచేత్తో కత్తి, మరోచేత్తో ట్రిమ్మర్‌తో వచ్చిన భర్త రాంబాబు ముందుగా నన్ను ఇంట్లో పెడరెక్కలు విరిచి కట్టేశాడు.
వైకాపా నాయకుల అండ ఉంది నిన్ను చంపేస్తే పది రోజుల్లోనే జైలునుంచి బయటకు తీసుకొస్తారు. ప్రజాప్రతినిధి తల్లిని కూడా వదలకుండా అల్లరి చేస్తున్నావు.. చచ్చిపో అంటూ ముందుగా కత్తి బయటకు తీశాడు. నేను కేకలు వేయడంతో ఒకవ్యక్తి నా భర్తను నిలదీశాడు. దీంతో నేను ఏమైనా చేసుకుంటానంటూ కత్తి లోపల పెట్టి ట్రిమ్మర్ శిరోముండనం చేశాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం పోలీసులు నన్ను పెడితే అక్కడికి సదరు వైకాపా నాయకుల అనుచరవర్గం వచ్చి పేర్లు బయటపెడితే ప్రాణాలకు ముప్పే అని హెచ్చరించారు.