ఆభిశంసన చేసే అధికారం మీకెక్కడిది : ఎస్‌ఈసీకి జగన్ సర్కారు ప్రశ్న

బుధవారం, 27 జనవరి 2021 (18:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ సమరం మొదలైంది. ఇందులోభాగంగా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌లను అభిశంసిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 
 
ఇవే ప్రొసీడింగ్స్‌ను ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగానికి కూడా పంపారు. అయితే, ఐఏఎస్ అధికారులకు ప్రొసీడింగ్స్ జారీ చేసే అధికారం ఎస్ఈసీకి లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఆయనకే తిప్పి పంపింది. ముందు వివరణ కోరకుండా ఎలా ప్రొసీడింగ్స్ జారీ చేస్తారని సర్కారు ప్రశ్నించింది.
 
కాగా, ఇదే అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎస్ఈసీ పంపిన అభిశంసన పత్రాన్ని తాము ఆయనకు తిప్పి పంపాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డపై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. 
 
నిమ్మగడ్డ పదవీకాలం మార్చి 31 వరకేనని, ఆ తర్వాత కూడా తమ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఇప్పటివరకైతే గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ ఇద్దరూ కూడా తమ పదవుల్లో కొనసాగుతున్నారని పెద్దిరెడ్డి వెల్లడించారు. 
 
ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (నిమ్మగడ్డ) ఎన్నికల సంఘానికి ఉన్న విచక్షణ అధికారాలను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై కక్షపూరితంగా చర్యలు తీసుకోవడం వెనుక నేపథ్యం ఏంటో అందరికీ తెలిసిందేనని అన్నారు.
 
గోపాలకృష్ణ ద్వివేది అంటే చంద్రబాబుకు కొండంత అభిమానం అని, అందుకే ఆయన ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని ద్వివేదిపై చర్యలకు ఆలోచన చేస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
గతంలో ద్వివేది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పనిచేశారని, అలాంటి వ్యక్తిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చర్యలు తీసుకోవడాన్ని ఎవరు ఆహ్వానిస్తారు? అంటూ పెద్దిరెడ్డి ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు