ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తేరుకోలని షాకిచ్చింది. మాజీ మంత్రి, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డితో పాటు.. అనేక మంది తెదేపాకు చెందిన ప్రధాన నేతలందరికీ కల్పిస్తూ వచ్చిన భద్రతను పూర్తిగా తొలగించింది. దీనిపై తెదేపా నేతలు మండిపడుతుంటే... స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ చేసిన సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వివరణ ఇస్తున్నారు.
గతంలో జేసీ దివాకర్ రెడ్డికి 2 ప్లస్ 2 భద్రత ఉండేది. జగన్ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత దీన్ని 1 ప్లస్ 1కు తగ్గించింది. తాజాగా భద్రతను పూర్తిగా ఉపసంహరించుకుంది. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భద్రతను తొలగించిన తెదేపా నేతల్లో కాల్వ శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ రెడ్డి, యరపతినేని, జీవీ ఆంజనేయులు తదితర నేతలకు ఉన్నారు.
మరోవైపు, మరోవైపు జేసీకి భద్రతను తొలగించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జేసీ కుటుంబంపై జగన్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి భూములను రద్దు చేశారు.
అలాగే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ, టీడీపీ నేతలకు గన్‌మెన్‌ల తొలగింపు రాజకీయ కక్ష్య సాధింపు చర్య అని ఆరోపించారు. పల్నాడు ప్రాంతం ఫ్యాక్షన్ ఏరియా అని.. అలాంటి ప్రాంతంలో ఉండే యరపతినేని, జీవీ ఆంజనేయులులాంటి వారికి భద్రత తొలగించారన్నారు.