దేశవ్యాప్తంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం తెల్లవారు జామునుండే అన్ని నగరాలతో పాటు , పల్లెటూర్లలో కూడా గణతంత్ర వేడుకలను మొదలుపెట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎల్ నరసింహాన్ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఏపీ సమర్థ నాయకత్వంలో అభివృద్ధిబాటలో పయనిస్తోందన్నారు. సంక్షేమరంగాల్లో ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. 12.23 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను వృద్ధిరేటు కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు గవర్నర్ ప్రశంసించారు. రికార్డ్ సమయంలో పట్టిసీమ పూర్తిచేసి, గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని, 2019 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నరసింహన్ చెప్పారు.