ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు షాకిచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోకగజపతి రాజును అడ్డుగోలుగా తొలగించి, ఆయన స్థానంలో సంచయితను ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ సర్కారు జారీచేసిన జీవోను హైకోర్టు కొట్టిపారేసింది.
మాన్సాస్, సింహాచలం ట్రస్టుల ఛైర్‌పర్సన్ నియామక జీవోను సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు ఆలకించిన తర్వాత తన తీర్పును సోమవారం వెల్లడించింది.
గతేడాది మార్చిలో సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా అనంద గజపతిరాజు సోదరి కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. ఆ మర్నాడే విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించడంతో వివాదం మొదలయ్యింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
వంశపారపర్యంగా వస్తున్న ట్రస్టు కావడంతో వయసులో పెద్దవారు ట్రస్టీగా ఉండాలని.. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ట్రస్టుల ఛైర్మన్‌ను నియమించిందని అశోక్ గజపతిరాజు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారమే నియామకం చేశామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తిరిగి నియమించాలని ఆదేశించింది.