కాపులను బీసీల్లో చేర్చటం చంద్రబాబుకే సాధ్యం: చినరాజప్ప

ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:51 IST)
కాపులను బీసీ జాబితాలో చేర్చటం సీఎం చంద్రబాబుకే సాధ్యమని ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఏటా ఆస్తుల వివరాలు ప్రకటిస్తూ సీఎం పారదర్శకత చాటుకుంటున్నారని అన్నారు. సీఎంపై అనవసర విమర్శలతో కాపులకు అన్యాయం చేయటం తగదన్నారు. 
 
'2 ఎకరాల భూమి స్థాయి నుంచి రూ.2 లక్షల కోట్లు సంపాదించిన కిటుకేదో చెబుతారా?' అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపిన విషయం తెల్సిందే.  
 
దీనిపై ఆయన స్పందించారు. సీఎం ఆస్తులపై ముద్రగడ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ముద్రగడ వెంటనే దీక్ష విరమించాలని ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ కోరారు. కాపులకు మేలు చేయాలనుకుంటే ముద్రగడ దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.
 
అందరు రాజకీయ నేతలకు భిన్నంగా చంద్రబాబు ఏటా తన ఆస్తులనే కాక తన కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. ఏ ఒక్కరూ అడగకున్నా తనకు తానుగా చంద్రబాబు తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నా, చంద్రబాబుకు రూ.2 లక్షల కోట్ల ఆస్తులున్నాయని చెప్పడం మీకు తగునా? అని ముద్రగడను చినరాజప్ప ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి