జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వంలో సమాచార, పౌరసంబంధాల ఫిలిం ఆటోగ్రఫీ మంత్రి పేర్నినానిల మధ్య ట్వీట్ల, నోటి మాటల యుద్ధ నడుస్తోంది. ఒకరిపై ఒకరు వ్యంగ్యంగా, తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. వారి మధ్య అసలు మాటలు కన్నా, పర్యాపదాలు, ఇండైరెక్ట్ ఎత్తిపొడుపులే ఎక్కువగా ఉంటున్నాయి.
రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, దాని పర్యవసానంగా, అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం ట్విటర్‌లో వేరే స్థాయికి చేరింది.
తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు నమస్కారాలు అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు. దీనితో జనసేన వర్గాలకు దిమ్మతిరిగి బొమ్మకనిపించింది. వైకాప నేత, మంత్రి పేర్ని నాని కూడా ఇంత రిథమ్, రైమింగ్ తో వ్యాఖ్య చేస్తారని వారు ఊహించ లేదు. మొత్తం మీద అటు మంత్రి పేర్ని నాని, ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య యుద్ధం చివరికి దేనికి దారితీస్తోందో అని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.