ఉద్యోగ భద్రతపై త్వరలోనే నిర్ణయం.. మాపై విశ్వాసం ఉంచండి: మంత్రి ఆదిమూలపు సురేష్

సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:13 IST)
కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రతపై అధికారులతో చర్చించిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ అంశంపై సచివాలయం లోని ఛాంబర్ లో యూనియన్ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.

డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ ల సమస్యలపై యూనియన్ లు ఇచ్చిన వినతులపై మంత్రి స్పందించి సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై చర్చించారు. వినతి పత్రం ఇచ్చిన వెంటనే స్పందించి సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి సురేష్ ను యూనియన్ ప్రతినిధులు ప్రశంసించారు.

తమ సమస్యలపై వెంటనే స్పందించి చర్చలు జరిపిన మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మీరేనని కృతఙ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక తమకు వేతనాలు, ఇతర అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నామన్నారు. 
 
ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ....."రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సంపూర్ణ విశ్వాసం తో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే ఆ మాటకోసం ఎంతదూరమైన వెళతారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై 2019 జూలై లో జీ ఓ ఎం, 2019 నవంబర్ లో వర్కింగ్ కమిటీ వేయటం జరిగింది.
 
ఈ లోగా కోవిడ్ రావటం తో పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. మీ ఉద్యోగ భద్రతకు మేము భరోసా ఇస్తాం. మార్చి 2022 వరకు ఒప్పందం ఉంది. అప్పటివరకు ఇబ్బంది లేదు. ఈ లోగా సీఎం తో మాట్లాడి తదుపరి విధివిధానాలు ప్రకటిస్తాం.
 
విద్యావ్యవస్థలో ప్రయివేట్ యాజమాన్యాల గుత్తాధిపత్యాన్ని లేకుండా చేసెందుకు కొన్ని సంస్కరణలు జరుగుతున్నాయి. ఎయిడెడ్ పోస్ట్ ల ద్వారా ఎంతమంది వస్తున్నారో? ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎటువంటి ఇబ్బందులు వస్తాయో సమగ్రంగా చర్చిస్తాం. ఆందోళనకు ముగింపు చెప్పండి. మీ సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి నిర్ణయం తెలియజేస్తాం" అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు