ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దయినట్లేనా?

మంగళవారం, 10 మార్చి 2020 (09:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్న వైకాపా అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తనకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండే సీనియర్‌ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావులకు ఆయన తొలి అవకాశం కల్పించారు. 
 
నిజానికి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరికి మంత్రిపదవులు కేటాయించారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఇపుడు వైకాపా ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. ఈ నిర్ణయానికి శాసన మండలి రద్దు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదిస్తే వారిద్దరూ మాజీలు అవుతారు. 
 
ఈ విషయం ఇంకా కొలిక్కి రాకమునుపే ఇద్దరు నేతలను రాజ్యసభకు ఎంపిక చేయడం విశేషం. తద్వారా మండలి రద్దుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక... టీడీపీని వీడి వైసీపీకి వచ్చిన సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ స్థానం ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. 
 
అలాగే, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తదితరుల పేర్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మోపిదేవి, పిల్లి సుభాష్‌లలో ఒక్కరికే రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు భావించాయి. అయితే, గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే వీరిద్దరినీ అత్యున్నత స్థానానికి పంపుతానని జగన్‌ వెల్లడించారు. చెప్పినట్లుగా వారిని రాజ్యసభకు పంపించారు. 
 
ఇక... 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అయోధ్య రామిరెడ్డి తెరవెనుక ఉండి తీవ్ర కృషి చేశారు. ఆయనకూ ఇప్పుడు పెద్దల సభలో చోటుకల్పించారు. ఇకపోతే, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్‌ నత్వానీకి రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే, ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు