ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారుకు ఆ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా 50 శాతానికిపైగా రిజర్వేషన్లు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది.
అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం, నెలలోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. కాగా, ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. తాజాగా వెలువడిన కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థలు ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ రాష్ట్ర సర్పంచుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలిసి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపటప్రేమ చూపిస్తున్నాయంటూ ధ్వజమెత్తారు.