అమరావతిలో శాసన రాజధాని వద్దు.. గోంగూర కట్టావద్దు... : మంత్రి కొడాలి నాని

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (11:57 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు తనలోని అక్కసును వెళ్లగక్కారు. అమరావతిలో శాసనరాజధానే కాదు.. ఏమీ ఉండకూడదంటూ మండిపడ్డారు. పేదలు నివసించడానికి జానెడు స్థలం ఇవ్వలేని అమరావతి ఎందుకు అంటూ ఆయన మరోమారు ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం ఏపీలో పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ మూడు రాజధానుల్లో భాగంగా, వైజాగ్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తలపిస్తున్నారు. దీంతో ఈ అంశంపై చర్చ సాగుతోంది. 
 
ఈ క్రమంలో ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, రైతులు కొనేందుకు భూమి, పేదలకు ఇచ్చేందుకు ఇళ్ల స్థలాలు లేని ప్రాంతంలో రాజధాని ఎందుకంటూ ఆయన నిలదీశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనూ చర్చించానని తెలిపారు. అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం నిర్ణయించగా, వాటిని ఇవ్వవద్దంటూ నిరసనకారులు అడ్డుపడుతున్నారని నాని ఆరోపించారు.
 
తన వాదనను ఆలకించిన తర్వాత సీఎం సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని, పలువురు ఇతర నేతలు, అమరావతి ప్రాంత పేదలను సంప్రదించిన తర్వాతనే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చానని అన్నారు. కనీసం తమ పార్టీ నేత లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో వాదించే అర్హత కూడా లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు