మంత్రులేమీ హీరోలు కాదు కదా : హైకోర్టు జస్టిస్ రాకేశ్ కుమార్

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:41 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ సర్కారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనల జారీలో వివక్ష చూపుతోందని, ప్రజాధనంతో జారీచేసే ప్రభుత్వ ప్రకటనల్లో వైకాపా జెండా రంగులను వినియోగిస్తూ, ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేస్తూన్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిల్‌పై విచారణనను ప్రథమ ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రకటనల జారీలో ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్‌ నేతృత్వంలోని సాక్షి దినపత్రికకు, ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేతృత్వంలోని సాక్షి టీవీకి అధిక ప్రాధాన్యమిస్తూ ఆ సంస్థలకు భారీగా ప్రజా ధనాన్ని పంచిపెడుతున్నారంటూ విజయవాడకు చెందిన కిలారు నాగశ్రవణ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
 
ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ సదుద్దేశంతో పిల్‌ దాఖలు చేయలేదని, రాజకీయ ప్రయోజనం కోసమే కోర్టుకు వచ్చారని పేర్కొన్నారు. కేబినెట్‌ మంత్రుల ఫొటోలు కూడా వేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని, పిటిషనర్‌ తన పిటిషన్‌లో ఆ విషయాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోనూ సీఎం ఫొటోతో పసుపురంగులో ప్రకటనలు ఇచ్చారన్నారు. 
 
అయితే ధర్మాసనం విచారణను వాయిదావేశాక అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించడంపై దమ్మాలపాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. తుదిగా న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ వ్యాఖ్యానిస్తూ.. 'ఏ మంత్రుల ఫొటోలైనా మాటిమాటికీ ప్రచురించడమనేది సరికాదని నా వ్యక్తిగత అభిప్రాయం. గత ప్రకటనలనూ నేను సమర్థించడం లేదు. ప్రభుత్వం చేసేది ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఉండాలి. అంతేతప్ప ఫొటోలను ప్రచురించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పనిని ప్రజలకు తెలియజేయండి. మంత్రులేమీ హీరోలు కాదు కదా!' అని వ్యాఖ్యానించారు. 
 
 
‘‘ఏ మంత్రుల ఫొటోలైనా మాటిమాటికీ ప్రచురించడమనేది సరికాదని నా వ్యక్తిగత అభిప్రాయం. గత ప్రకటనలనూ నేను సమర్థించడం లేదు. ప్రభుత్వం చేసేది ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఉండాలి. అంతేతప్ప ఫొటోలను ప్రచురించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పనిని ప్రజలకు తెలియజేయండి. మంత్రులేమీ సినిమాల్లో హీరోలు కాదు కదా!’

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు