నిషిత్ అంత్యక్రియలు పూర్తి.. : ఏ తండ్రికీ రాకూడదు: నారాయణ

గురువారం, 11 మే 2017 (11:41 IST)
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు గురువారం ఉదయం నెల్లూరు పట్టణంలోని పెన్నా నదీ తీరంలో జరిగాయి. కుమారుడు ప్రమాద వార్త తెలియగానే నారాయణ హుటాహుటిన లండన్ నుంచి చెన్నైకు, అక్కడ నుంచి నెల్లూరుకు చేరుకున్నారు. అనంతరం కుమారుడి మృత దేహాన్ని చూసి భోరున విలపించారు. తనలాంటి దుస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహచర మంత్రులు ఆయనను ఓదార్చారు.
 
ఆ తర్వాత నెల్లూరు శివార్లలోని పెన్నానదీ తీరంలో నిషిత్ అంత్యక్రియల నిమిత్తం ఏర్పాట్లు చేసి అక్కడే పూర్తి చేశారు. పక్కనే నారాయణ సహా, పలువురు బంధువులు వెంటరాగా, పుర వీధుల గుండా దాదాపు 45 నిమిషాల పాటు అంతిమయాత్ర సాగింది. మధ్యలో రైల్వే గేటు పడటంతో కొంతసేపు నిలిచిన యాత్ర, ఆపై పెన్నా తీరానికి చేరుకుంది. పైకి ధైర్యంగా కనిపిస్తున్నప్పటికీ, నారాయణ ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా తెలుస్తున్నాయి. స్వయంగా చేత్తో నిప్పున్న కుండను మోసుకుంటూ ఆయన వస్తుంటే, చూసిన ప్రతిఒక్కరూ కన్నీరు పెట్టారు. ఆ తర్వాత తన కుమారుడి అంతిమ సంస్కార క్రతువును మంత్రి నారాయణ పూర్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి