బీజేపీపై నిప్పులు చెరుగుతున్న ఏపీ మంత్రులు.. ఎందుకు?

శనివారం, 7 ఆగస్టు 2021 (14:50 IST)
భారతీయ జనతా పార్టీపై ఏపీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా, మంత్రి పేర్ని మీడియాతో మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
శనివారం మరో మంత్రి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీలో ఏదో ఒక రకంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని, రాష్ట్రంలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందని అంజాద్‌ బాషా ద్వజమెత్తారు. 
 
ప్రతిపక్ష పార్టీ, బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని ఏపీ మంత్రులను సీఎం జగన్ ఆదేశించారనే ప్రచారం జరుగుతోంది. అందులోభాగంగా బీజేపీని టార్గెట్ చేసుకుని ఏపీ మంత్రలు రెచ్చిపోతున్నారు. 
 
శుక్రవారం కేబినెట్‌ భేటీలో మంత్రులపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది మంత్రుల వ్యవహరశైలిపై ఆయన సీరియస్‌‌గా ఉన్నారని చెబుతున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ప్రశ్నించారని చెబుతున్నారు. 
 
ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని సీఎం నిలదీసినట్లు సమాచారం. సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ నేతల మాటలకు కౌంటర్‌ ఇవ్వాలని మంత్రులకు జగన్‌ ఆదేశించారని వినికిడి. అయితే, మంత్రులు బీజేపీని టార్గెట్ చేస్తే అది చివరకు ముఖ్యమంత్రి జగన్‌కే నష్టం చేకూర్చే ప్రమాదం లేకపోలేదు. జగన్ ఇప్పటికీ బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు