ఏపీలో కొత్త ప్రయోగం : రైతుల కోసం 4.5 లక్షలమందితో 19,364 వాట్సాప్ గ్రూపులు

శనివారం, 7 ఆగస్టు 2021 (08:54 IST)
దేశంలోనే తొలిసారిగా ఏపీలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్నదాతలకు మెరుగ్గా ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వారికి అనుక్షణం అండగా ఉంటోంది.

పంటల వారీగా రైతులతో వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్ చేసింది. ఇప్పటికే 4.5 లక్షలమందితో 19,364 గ్రూపుల ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో అధికారులు, శాస్త్రవేత్తలు, వలంటీర్లు వున్నారు. ఆడియో, వీడియోల ద్వారా సాగు అవగాహన.. ఇంకా రైతు సమస్యలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. 
 
రాష్ట్రంలో 54 లక్షలమంది రైతులున్నారు. మొత్తం రైతుల్లో 70 నుంచి 80 శాతం మంది వరి, అపరాలు సాగుచేస్తున్న వారే. ఇప్పటివరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సమాచారం కావాలంటే రైతుభరోసా కేంద్రానికి (ఆర్‌బీకేకు) వెళ్లి సిబ్బందిని అడిగి తెలుసుకునేవారు. సాగువేళ సందేహాలు, సమస్యలొస్తే తెలిసిన రైతుకో, సమీప వ్యవసాయాధికారికో చెప్పి వారి సలహాలు, సూచనలు పాటించేవారు
 
రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్‌బీకేలు పనిచేస్తున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయ సహాయకుల ద్వారా పంటల వారీగా రైతులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా ప్రాంతాల వలంటీర్లను కూడా చేర్చారు. స్మార్ట్‌ ఫోన్‌లు వాడుతున్న రైతులను ఇప్పటికే ఈ గ్రూపుల్లో చేర్చారు. రైతులు బేసిక్‌ ఫోన్‌ వాడుతుంటే వారి కుటుంబసభ్యుల్లో స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న వారి నంబరును ఈ గ్రూపులో చేర్చారు. 
 
ఫోన్లు ఉపయోగించని రైతులకు వలంటీర్ల ద్వారా గ్రూపులోని సమాచారం తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 19,364 గ్రూపులు ఏర్పాటు చేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,481 గ్రూపులు ఏర్పాటు చేయగా, అత్యల్పంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 846 గ్రూపులు ఏర్పాటు చేశారు. మిగిలిన వారిని కూడా ఖరీఫ్‌ సాగు పూర్తయ్యేలోగా గ్రూపుల్లో చేర్చాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
 
పంటలవారీ రైతులతో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపుల సంఖ్య
పంట వాట్సాప్‌ గ్రూపుల సంఖ్య
వరి, ఇతర ఆహారధాన్యాలు 9,181
పత్తి 1,737
మిరప 788
చెరకు 457
పసుపు 150
పట్టు 150
కొబ్బరి 127
పొగాకు 61
తమలపాకు 3
ఇతర పంటలు 192
ఉద్యానపంటలు 2,208
అపరాలు 2,178
నూనెగింజలు 2,132
మొత్తం 19,364

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు