ఇది గౌరవ సభా... కౌరవ సభా... వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తారా? చివరికి కుటుంబ సభ్యులపైనా దూషనలు చేస్తారా అంటూ, ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. చంద్రబాబు సతీమణిని వ్యక్తిగతంగా కించపరుస్తూ విమర్శలు చేసిన వైసీపీ సభ్యులపై ఆయన అసహనంగా స్పందించారు. మళ్ళీ గెలిచిన తర్వాతే శాసన సభకు వస్తా అంటూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
అంతకు ముందు అత్యవసర టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు కంట తడిపెట్టారు. ఇంట్లో మహిళలను కూడా వదలకుండా వ్యక్తిగత దాడి చేయటంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మళ్లీ గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతానని, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ కి వస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శపథం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయంతో తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ఘాంతపోయారు.
చంద్రబాబు చేసిన లుచ్చా పనులు అని మంత్రి కొడాలి నాని మాట్లాడటమే ఆయనను తొలుత మనసుకు బాధ కలిగించింది. దీనికి తోడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపైనా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడంతో ఆయన పూర్తిగా చలించిపోయారు. మళ్ళీ గెలిచిన తర్వాతే సభ కు వస్తా అని చంద్రబాబు సవాల్ చేశారు.