అమరావతి : ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల సాధన కోసం పోరాటం చేస్తున్న టీచర్లకు మద్దతునివ్వడంతో పాటు.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం వరకు విస్తృత కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలిపాయి. రాష్ట్ర జేఏసీ చైర్మర్ పి.అశోక్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఫ్యాక్టో, జాక్టో ఉపాధ్యాయ సంఘాల నేతలు.. ముఖ్యమంత్రికి తమ కృతజ్ఞతలు తెలిపి.. ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఫ్యాప్టో అధ్యక్షుడు పి. బాబురెడ్డి మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, విద్యాశాఖా మంత్రి వల్ల ఫలితం దక్కిందన్నారు. తమ నేతలు చేసిన కృషి కారణంగా.. రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం దక్కబోతోందని.. ఇందుకుగాను టీచర్లందరి తరపునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
జాక్టో కన్వీనర్ యం.కమలాకర్ మాట్లాడుతూ.. 1998లో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలోనే సర్వీస్ రూల్స్‌కు అంకురార్పణ జరిగిందని.. ఆ తరువాత అనేక ఆటంకాలు ఏర్పడినప్పటికీ.. మళ్లీ చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లనే తమ కల నెరవేరిందన్నారు. సర్వీస్ రూల్స్ పైన సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీ జేఏసీ చైర్మన్ పి.అశోక్ బాబు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసుల సాధన ఫలితంగా లక్షలాది మంది టీచర్లకు ప్రయోజనం కలగబోతోందని.. వేలాది మంది టీచర్లు ప్రమోషన్లు పొందబోతున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాటు, జేఏసీ నేతలు అశోక్ బాబు, ఎ.విద్యాసాగర్, ఐ.వెంకటేశ్వరరావు, వీరేంద్రబాబు తదితరులు ముఖ్యమంత్రికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో MLCలు కె.యస్ రామకృష్ణ, బొడ్డు నాగేశ్వర రావు, బాలసుబ్రమణ్యం, శ్రీరాం సూర్యా రావు, ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు, కో చైర్మన్లు సీహెచ్.జోసెఫ్ సుధీర్ బాబు, పాండురంగ ప్రసాద్ కె.నరహరి, ఎం.శంకరరావు, బి.వెంకట్రావు, బి.కరీముల్లా, జి.సౌరి రాయలు, చంద్ర కృష్ణ మెహన్, తదితరులు పాల్గొన్నారు.