తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నాయి. అయితే, ఈ సమ్మెకు మాత్రం దూరంగా ఉండాలని ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. మంగళవారం నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలు చేపట్టే సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు ఏపీ ట్రెజరరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుడూ, పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తెచ్చేది మేమే.. కూల్చేది మేమే అన్న చందంగా ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం మంచిదికాదన్నారు. పైగా, ఇది అనేక విమర్శలకు దారితీస్తుందన్నారు.
ముఖ్యంగా, ఒక్కో ఉద్యోగి కుటుంబానికి ఐదు ఓట్లు ఉన్నాయంటూ బెదిరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ఇప్పటివరకు సార్ సార్ అంటూ ప్రభుత్వం పెద్దలను బతిమాలుకున్న ఆయన ఇపుడు ఒక్కసారిగా ఇలా ఫ్లేటు ఫిరాయించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.