ఆప్కో కొత్త షోరూంల కోసం స్ధలాన్వేషణ... కార్పొరేట్ సంస్ధలకు పోటీగా...

గురువారం, 2 డిశెంబరు 2021 (18:02 IST)
చేనేత ఉత్పత్తులపై సమాజంలో ఉన్న మక్కువ అధారంగా విక్రయాలను మరింత పెంచుకోవలసిన అవశ్యకత ఉందని ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు స్పష్టం చేసారు. విపణి ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త షోరూమ్ లు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్స్ , షోరూం మేనేజర్లు, ఇతర అధికారులతో గురువారం రాష్ట్ర స్దాయి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
 
ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్ధల పోటీని తట్టుకుని ఆప్కో విక్రయాలను పెంచేందుకు మార్కెటింగ్ సిబ్బంది బాధ్యత తీసుకోవలసి ఉందన్నారు. రానున్న పండుగల సీజన్ దృష్ట్యా ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగతంగా లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుగు సాగాలన్నారు. చేనేత ఉత్పత్తుల  క్రయవిక్రయాల వల్ల చేనేత కార్మికులకు మరింత ఆర్ధిక తోడ్పాటుతో పాటు నిరంతరం పని లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చేనేత రంగానికి అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
 
చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మరింత నాణ్యమైన ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటు ధరలలో సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన విక్రయశాలల నిర్మాణానికి అవసరమైన అవసరమైన స్ధలాలను గుర్తించాలని, ఇటీవల ప్రారంభించిన ఓంగోలు షోరూమ్ విషయంలో మంచి స్పందన ఉందన్నారు. అతి త్వరలో గుంటూరు, కడపలో కూడా నూతన విక్రయశాలలను అందుబాటులోకి రానున్నాయన్నారు. 
 
 
నష్టాల బాటలో ఉన్న వాటిని లాభాలలో తీసుకురావలసి బాధ్యత షోరూమ్ మేనేజర్లదేనన్నారు. ఆలసత్వంతో వ్యవహరించే వారిని వ్యక్తిగతంగా బాధ్యులను చేసి చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమన్నారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు, ఆప్కో జిఎం కన్నబాబు, ప్రాంతీయ సంయిక్త సంచాలకులు నాగేశ్వరరావు, ఉపసంచాలకులు మురళీ కృష్ణ, ఆప్కో సీనియర్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, ప్రత్యేక అధికారి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు