మిస్టర్ జైట్లీ.. ఏదైనా వుంటే సీఎంతో మాట్లాడండి : సుజనా చౌదరి

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:53 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఘాటుగానే బదులిచ్చారు. పార్లమెంట్‌ లాబీలో తారసపడిన సుజనా చౌదరితో అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ, పార్లమెంట్‌లో నిరసనలు ఆపాలని కోరారు. దీనికి సుజనా కూడా ఘాటుగానే బదులిచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను పరిష్కరించేవరకు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని ఆయన జైట్లీకి తెలిపారు. 
 
సభలో జరిగిన పరిణామాలన్నీ స్వయంగా చూసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీ వివరాలను బహిర్గతం చేసేందుకు ఆయన నిరాకరించారు. ఇదిలావుంటే ప్రధానమంత్రితో భేటీకి వెళ్లే ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ప్రత్యేకంగా పిలిపించకుని మాట్లాడడం గమనార్హం.
 
మరోవైపు, కొత్త వ్యూహంతో ముందుకెళుతున్న టీడీపీ ఎంపీలను కట్టడి చేసేందుకు స్వయంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రంగంలోకి దిగారు. రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకోవడమేకాకుండా, ఏపీకి న్యాయం చేసేదాకా కదిలేది లేదంటూ పోడియం వద్దకు దూసుకెళ్లి ఆందోళన చేశారు.
 
ఇంతలో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ కల్పించుకుని ఏపీ అంశం గురించి ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడతారంటూ ఎంపీలు సీఎం రమేశ్, గరికపాటి, తోట సీతారామలక్ష్మికి చెప్పారు. కురియన్ సూచనతో టీడీపీ ఎంపీలు వెనక్కి తగ్గారు. అనంతరం కాసేపటికే ఆర్థికమంత్రి జైట్లీ ఏపీ అంశంపై స్పందించడం విశేషం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు