కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యేగా జయరాములు ఉన్నారు. ఈయన విలేకరులతో మాట్లాడుతూ 'నేను తెలుగుదేశం పార్టీలో లేనా? ఆ పార్టీ ఎమ్మెల్యేను కాదా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తాను టీడీపీలో చేరాను' అని అన్నారు. బద్వేలు నియోజకవర్గం పేరుకే ఎస్సీ రిజర్వుడు... పెత్తనమంతా ఒక వర్గం వారిదేనని, నియోజకవర్గంలోని ప్రజలను అభివృద్ధి చెందకుండా అడ్డుకునేది ఆ వర్గమని ఆయన ఆరోపించారు.
దళిత ఎమ్మెల్యేనైన తన ఆత్మగౌరవం దెబ్బతినేలా మాజీ ఎమ్మెల్యే ప్రవర్తించడం బాధాకరమని ఆయన వాపోయారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మంత్రులంతా కూడా ఆమెకు మద్దతు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ఎమ్మెల్యే నిలదీశారు. దళితులపై ఎందుకు ఇంత చిన్నచూపు అని, వారిని మనుషులుగా గుర్తించాలి కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలు నియోజకవర్గంలో 7 సబ్‌స్టేషన్లు మంజూరు చేయించామని, అయితే తనకు తెలియకుండా సబ్‌స్టేషన్‌లో నియామకాలు జరిగిపోవడం చూస్తే తాను టీడీపీ ఎమ్మెల్యేను కాదా అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న గౌరవంతో పార్టీలోకి వచ్చానని, ఇప్పుడు తనను కూడా టార్గెట్ చేస్తూ, నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలపై త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళుతున్నట్లు ఆయన తెలిపారు.