బాలకృష్ణ అంటే శ్రీనివాసుడికి ఎనలేని అభిమానమట.. ఎందుకో తెలుసా?

గురువారం, 28 జూన్ 2018 (10:53 IST)
ముఖ్యమంత్రి చంద్రచాబు నాయుడి వియ్యంకుడు, సినీ నటుడు,‌ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అంటే తిరుమల శ్రీవారికి ప్రత్యేక అభిమానం‌ ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ఉండగా హిందూపురం నియోజకవర్గానికి కేటాయిస్తున్నన్ని నిధులు మరే ఇతర నియోజకవర్గానికి టీటీడీ కేటాయించడం లేదు. బాలకృష్ణ నుంచి సిఫార్సు లేఖ అందినదే తడవుగా ఆలయాల పునరుద్ధరణ, కల్యాణ మండపాల పునరుద్ధరణ పేరుతో నిధులు కేటాయిస్తున్నారు. 
 
తాజాగా మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో హిందూపురం నియోజకవర్గం చేలూరులోని ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.27 లక్షలు మంజూరు చేశారు. గతంలో లేపాక్షి మండలం బింగిపల్లిలోని గుప్త కామేశ్వరి ఆలయ పునరుద్ధరణకు రూ. 1.60 కోట్లు కేటాయించారు. 
 
టీటీడీ నిబంధనల ప్రకారం ఆలయాల పునరుద్ధరణకు గరిష్టంగా రూ.25 లక్షలు మాత్రమే కేటాయించడానికి అవకాశముంది. ఇంకా హిందూపురంలోని రంగనాథ స్వామి ఆలయానికి రూ.55 లక్షలు కేటాయించారు. అదేవిధంగా లేపాక్షి, చిలమత్తూరులో కల్యాణ మండపాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.1.45 కోట్లు కేటాయించారు.
 
ధర్మచక్రంకు లభ్యమైన వివరాల మేరకే హిందూపురం నియోజకవర్గానికి మూడేళ్ల కాలంలో రూ.5.30 కోట్లు దాకా కేటాయించారు. పురాతన ఆలయాల పునరుద్ధరణకు నిధులు ఇవ్వడంలో తప్పులేదుగానీ దానికి పారదర్శక విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. 
 
పలుకుబడి కలిగిన ఎంఎల్ఏలు సిఫార్సు చేస్తే నిబంధనలను పక్కనపెట్టి నిధులు ఇవ్వడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓ ఆలయానికి రూ.4.75 కోట్లు కేటాయించిన ఉదంతం కూడా ఉంది. ఇది ఉన్నత సిఫార్సు మేరకే జరిగిందనేది జహిరంగ రహస్యం. శ్రీవారి నిధుల గురించి ఎవరూ ప్రశ్నించకపోవచ్చు కానీ స్వామివారు గమనిస్తుంటారన్న విషయాన్ని అధికారులు గమనంలో ఉంచుకోవాలని భక్తులు అంటున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు