ఒంగోలు జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టినట్టు నిరూపిస్తే తన యావదాస్తిని రాసిస్తానని ఆయన ప్రకటించారు. తనతో పాటు తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి కూడా రూపాయి పెట్టుబడులు లేవని స్పష్టం చేశారు. ఆరోపణలు రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని బాలినేని ప్రకటించారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. తమపై దుష్ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. తనకు సినీ రంగంలో పెట్టుబడులు ఉన్నాయో లేదో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీసుకోవచ్చన్నారు.
కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థలో మాజీ మంత్రి బాలినేనికి పెట్టుబడులు ఉన్నాయంటూ విశాఖపట్టణంకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవల ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ అక్రమ లావాదేవీల విషయంలో మాజీ మంత్రి బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి, వైకాపా నేత, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వర రావులపై విచారణ జరిపించాలని కోరారు. సదరు నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీల వెనుక తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సన్నిహితుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు.