సమాజ హితం కోసమే పెద్దనోట్ల రద్దు... బండారు దత్తాత్రేయ

శనివారం, 26 నవంబరు 2016 (18:37 IST)
పాత పెద్ద నోట్ల రద్దు సమాజ హితం కోసమేనన్నారు కేంద్ర కార్మిక శాఖామంత్రి బండారు దత్తాత్రేయ. ఒక వ్యక్తి స్వార్థప్రయోజనం కోసమో, లేకుంటే డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనతోనో ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేయలేదని స్పష్టం చేశారు దత్తాత్రేయ. ప్రతిపక్షాలు ఏ పక్షమో అర్థం కావడం లేదని, అనవసరంగా పెద్ద నోట్లపై పార్లమెంటులో రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారాయన. 
 
నరేంద్ర మోదీని అప్రతిష్టపాలు చేయాలని కావాలనే కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దును దేశప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి ఏ పని లేకపోవడంతోనే పెద్దనోట్లపై పడ్డారని విమర్శించారు. కార్మికులందరికీ ఆన్‌లైన్‌ ద్వారానే ట్రాన్సాక్షన్‌ చేసే బృహత్తర కార్యక్రమాన్ని మరో 15 రోజుల్లో ప్రారంభిస్తామని, అలాగే కార్మికులందరికీ జన్‌ధన్‌ యోజన అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో దత్తాత్రేయ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి