నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పోలింగ్‌లో మొత్తం 2,19,108 మంది ఓటర్లు పాల్గొననున్నారు. వీరందరి కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 800 మంది నుంచి 1000 మంది ఓటేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
మొత్తం 3500 మంది పోలీసులు ఎన్నికల రక్షణ బాధ్యతలు తీసుకోగా, అందులో పది కంపెనీలకు చెందిన 2,500 మంది కేంద్ర సిబ్బంది ఉండటం విశేషం. అలాగే, పోలింగ్ కేంద్రాల వద్ద 40 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు నియోజకవర్గ వ్యాప్తంగా భద్రత కల్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా సిబ్బందికి బాడీ ఓర్న్ కెమెరాలు, ఈవీఎంలకు వీసాశాట్ సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎన్నికలు సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
కాగా, ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్‌నగర్ బూత్ నంబర్ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు. కాగా, ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే.