ఐపీఎస్ అధికారులకు ఊరట - సామాజిక శిక్షలు నిలిపివేత

గురువారం, 28 ఏప్రియల్ 2022 (16:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమది మంది ఐపీఎస్ అధికారులకు ఆ రాష్ట్ర హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఐపీఎస్ అధికారులకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విధించిన సామాజిక శిక్షలను ఎనిమిది వారాల పాటు అంటే రెండు నెలల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం కీలక ఆదేశాలు జారీచేసింది.
 
గతంలో పాఠశాల ప్రాంగణంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయొద్దంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సంబంధిత శాఖల ఐపీఎస్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అంశంపై పలు మార్లు విచారణ జరిగింది. అయినప్పటికీ అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. 
 
దీన్ని కోర్టు ధిక్కరణంగా పరిగణిస్తూ 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో తీర్పునిచ్చారు. అయితే, న్యాయమూర్తి శిక్షలను ఖరారు చేస్తున్న సమయంలో కోర్టు బోనులోనే ఉన్న ఈ ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పడంతో జైలుశిక్షను సామాజిక శిక్షగా మార్పించుకున్నారు.
 
అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఇద్దరు ఐపీఎస్‌లు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన బెంచ్ వారి శిక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మిగిలిన ఆరుగురు ఐపీఎస్‌లు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను విచారించిన డివిజన్ బెంచ్ వీరికి కూడా ఊరట కల్పిస్తూ సామాజిక శిక్షను 8 వారాల పాటు వాయిదా వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు