ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ రోజున తెలుగు పరీక్ష జరిగింది. అయితే, ఈ పరీక్ష ప్రారంభానికి ముందే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లలో హల్చల్ చేసింది. దీనికి సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లీకేజీ సూత్రధారి రాజేశ్‌తో సహా మొత్తం 12 మంది ఉన్నారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్ నుంచి ఈ ప్రశ్నపత్రం లీకైనట్టు గుర్తించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రశ్నపత్ర లీకైనట్టు వార్తలు రాగానే జిల్లా విద్యాశాఖాధికారి, పోలీసు అధికారులు వేగంగా విచారణ చేపట్టారన్నారు.
పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్‌లో ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసి, ఆ ఫోటోలను బయటవేచివున్న తెలుగు టీచర్లకు పంపించాడని తెలిపారు. ఈ కేసులో అరెస్టు అయినవారిలో నాగరాజు, నిలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్టు, రంగనాయకులు ఉన్నారని తెలిపారు.
ఇంత జరుగుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఇదిలావుంటే ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు చేసిన వారిని గురువారం కోర్టులో హాజరుపరిచారు.