కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగిస్తూ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొంటూ పలు అభ్యంతరాలను లేవనెత్తారు. వాటి ప్రాతిపదికన లోక్‌సభ స్పీకర్ పరిశీలనార్థం బిల్లును పంపుతున్నట్టు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ రూలింగ్ ఇచ్చారు. బిల్లుపై ఇప్పుడు ఓటింగ్ పెట్టాలని కోరుతున్న సభ్యులను వారిస్తూ, బిల్లుపై చర్చ ముగిసిందని, ఆర్థిక మంత్రి లేవనెత్తిన అభ్యంతరాలను తీర్చిన తర్వాతనే ముందుకు వెళ్లగలుగుతానని వెల్లడించారు.
ఒక బిల్లు మనీ బిల్లు అవుతుందా? కాదా? అన్న విషయాన్ని తేల్చే హక్కు తనకు లేకపోయిందని, ఈ విషయంలో లోక్‌సభ స్పీకర్‌దే తుది నిర్ణయమని రాజ్యాంగ నిబంధనలను ఉటంకించారు. సభ్యులకు అనుమానాలు ఉన్నాయని, తనకూ అనుమానం ఉందని స్పష్టం చేసిన ఆయన బిల్లును లోక్‌సభకు పంపుతున్నట్టు తెలిపారు. తుది నిర్ణయాధికారం స్పీకర్ దేనని స్పష్టం చేశారు.