విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం వల్ల సీమాంధ్ర ఓటర్లు తమను తిరస్కరించారని బీజేపీ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అభిప్రాయపడ్డారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే తాము ఏపీలో నష్టపోయామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల తాము ఆంధ్రాలోనే కాదని తెలంగాణలో కూడా దెబ్బతిన్నామన్నారు. ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తాము గెలిచిన స్థానాల్లో నివశించే సీమాంద్రకు చెందిన సెటిలర్స్ ఓట్లు బీజేపీకి పడలేదన్నారు.
సెటిలర్స్ కూడా ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే బీజేపీకి దూరమయ్యారని ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ మోసం చేసిందని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేశారని, రాజకీయ ఉద్దేశంతో తమపై చేసిన దుష్ప్రచారం తమకు బాగానే నష్టాన్ని కలిగించిందన్నారు.