గుడ్డిగా ప్రైవేటీకరించడం సరికాదు : బీజేపీ ఎంపీ స్వామి కామెంట్స్

గురువారం, 11 మార్చి 2021 (07:49 IST)
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుని దాన్ని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరించాలని భావించడం సరికాదన్నారు. 
 
ఆయన బుధవారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత స్వామి మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని.. దీన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణను తాను గతంలో వ్యతిరేకించానని గుర్తు చేశారు.
 
ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. ప్రతిదాన్నీ ప్రైవేటీకరించడం మంచిది కాదని.. బలమైన కారణాలుంటేనే అలా చేయాలన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా? లేదా? అనేదాన్ని కేస్‌ బై కేస్‌ చూడాలని వ్యాఖ్యానించారు. 
 
తితిదేను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలన్నారు. తితిదే ఖాతాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్న సీఎం జగన్‌ నిర్ణయం బాగుందని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. తితిదేను భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు