ఈ సందర్భంగా తితిథ్ సింగ్ రావత్ మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనలాంటి ఓ సామాన్య కార్యకర్తకు ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు.
'ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కార్యకర్తనైన నా మీద నమ్మకం ఉంచినందుకు ప్రధాని, హోంమంత్రి, పార్టీ చీఫ్‌లకు కృతజ్ఞతలు. ఈ స్థాయికి వస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాను. గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తాం' అని చెప్పుకొచ్చారు.
56 ఏళ్ల తిరథ్ సింగ్ రావత్ ప్రస్తుతం గర్హ్వాల్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 నుంచి 2017 వరకు చౌబ్తాఖల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. పార్టీ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. అందుకే ఆయన కలలో కూడా ఊహించని ముఖ్యమంత్రి పీఠం దక్కింది.