విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం చేతులెత్తేసిందంటూ వార్తా కథనాలు వచ్చాయి. వీటిపై జీవీఎల్ స్పందించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలను ప్రచురిస్తున్నాయని ఆరోపించారు. రైల్వే జోన్ అంశంపై రైల్వే బోర్డు ఛైర్మన్ త్రిపాఠీతో ప్రకటన చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనను చదివి వినిపించారు.
విభజన హామీల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించాలన్నారు. కేవలం వ్యక్తిగత సమస్యల కోసమే కలుసుకుంటారా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ఒకలా ఢిల్లీలో ఒకలా వైకాపా, తెరాస అధినేతలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు డ్రామాలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.