అసత్య ప్రచారం చేసి తప్పించారు.. చంద్రబాబుకు షాకిచ్చారు.. ఎమ్మెల్యే పదవికి బొజ్జల రిజైన్!

ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (11:05 IST)
రాష్ట్రమంత్రిగా విధులు నిర్వహించేందుకు తనకు ఆరోగ్యం సహకరించడంలేదంటూ అసత్య ప్రచారం చేశారని అందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు, సీఎంకు ఆయన పంపించారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న తనను తప్పించడమేంటని సన్నిహితుల వద్ద ఆయన వాపోయినట్లు సమాచారం. 
 
అంతేకాకుండా, తన ఆరోగ్యం గురించి అసత్యప్రచారం చేయించారని వాపోయారు. అనారోగ్యం కారణం చూపి మంత్రి పదవి నుంచి తొలగిస్తే... ఇక ఎమ్మెల్యేగా కూడా ఎందుకని ఆయన ప్రశ్నిస్తూ శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు సమచారాం. అంటే, చంద్రబాబు ఆదివారం చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చిత్తూరు జిల్లా టీడీపీలో చిచ్చు రేపిందని చెప్పొచ్చు. 
 
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా నుంచి లోకేష్‌కు, అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై బొజ్జలతో పాటు పలువురు ఆశావహులు కూడా అసంతృప్తితో ఉన్నప్పటికీ.. ఈ జిల్లా నుంచి కేవలం ఇద్దరికే మంత్రి పదవులు కేటాయించారు.

వెబ్దునియా పై చదవండి