నేటి హస్తినకు సీఎం జగన్ - రెండు రోజులు అక్కడే మకాం

సోమవారం, 30 జనవరి 2023 (10:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. 
 
ఈ నెల 31వ  తేదీన ఢిల్లీలో జరుగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్‌లో వివిధ దేశాల దౌత్యవేత్తలతో సీఎం జగన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. 
 
మరోవైపు, సోమవారం మధ్యాహ్నం వరకు ఆయన పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు జిల్లాలోని వినుకొండకు చేరుకుంటారు. అక్కడ 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు వినుకొండ వెల్లటూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. 
 
జగనన్న చేదోడు వాదోడు పథకం లబ్ధిదారుల ఖాతాలకు ఆయన నగదు బదిలీ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 1.05 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
 
అయితే, సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెనుక ప్రధాన కారణం లేకపోలేదు. తన బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీగా ఉన్న తన సోదరుడు వైఎస్.అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే విచారించింది. అవసరమైతే మరోమారు పిలుస్తామని చెప్పింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకే ఆయన వెళుతున్నారనే ప్రచారం సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి