అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయవద్దు: బుగ్గన

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:42 IST)
అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు యధాతథంగా...
 
"ప్రతి పక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు దాచిపెట్టి, టి.డి.పికి  అనుకూలమైన లెక్కల చెప్పి, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. 
 
ఆర్థిక వ్యవస్థలో అన్ని ఆర్థిక కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయాన్ని ప్రస్తుత ధరలతో లెక్క కడితే దానిని ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి అని అంటారు. అదే ఒక ఆర్థిక వ్యవస్థలో అన్ని ఆర్థిక కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయాన్ని స్థిరమైన (బేస్ ఇయర్ 2011-12) ధరలతో లెక్క కడితే దానిని స్థిరమైన ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటారు. 
 
ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధి స్థిరమైన ధరల  వద్ద అంచనా వేయబడుతుంది. స్థిరమైన ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తిని బేస్ ఇయర్ ధరలలో లెక్క కట్టడం వలన ఆర్థిక వ్యవస్థపై ధరల ప్రభావం తెలియదు. అందువలన ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధిని అంచనావేయడం కోసం స్థిరమైన ధరలను ఉపయోగిస్తారు. అలాకాకుండా ప్రతిపక్ష నాయకులు ప్రస్తుత ధరలపై వృద్ధి రేట్లు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. 
 
అలాగే ప్రతిపక్ష టీడీపీకి వ్యవసాయ రంగ అభివృద్ధి అసలు పట్టడం లేదు. చంద్రబాబుతో పాటు, టీడీపీ నాయకులు వ్యవసాయ రంగాన్ని ఏవిధంగా హేళన చేశారో, ప్రతి పక్షంలో ఉన్నా కూడా అదే ధోరణితో మన రాష్ట్రానికి జీవనాధారమైన వ్యవసాయ రంగ వృద్ధి రేటును దాచి దాచి రైతన్నను మోసం చేస్తున్నారు. 
 
కరోనా ముందు సంవత్సరం 2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 7.23% వృద్ధిః
సుదీర్ఘ అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న యనమల రామకృష్ణుడు గారు కరోనా సంవత్సరాన్ని కలిపి లెక్కలు గట్టి ఆర్ధిక వృద్ధి కాలేదు అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయానికే మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో వృద్ధి రేటు క్షిణిస్తూ వచ్చింది.

రాష్ట్ర జి.ఎస్.డి.పి 2017-18లో 10.09% వృద్ధి రేటు ఉంటే, 2018-19లో 4.88%కి పడిపోయింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అతి తక్కువ. అదే మా ప్రభుత్వ హయాంలో 2019-20లో  రాష్ట్రం 7.23% వృద్ధి నమోదుచేసి దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. 2019-20లో మన రాష్ట్రం వ్యవసాయం రంగంలో 7.91%తో, పారిశ్రామిక రంగంలో 10.24%తో మరియు సేవ రంగంలో 6.20% వృద్ధితో అంచనాలకు మించి పనితీరును కనబరిచాం. 
 
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020-21లో ప్రపంచ మరియు దేశ ఆర్థిక స్థూల ఉత్పత్తి భారీగా పతనమైంది. కరోనా కారణంగా 2020-21లో మన రాష్ట్ర ఆర్ధిక స్థితి కూడా బాగా దెబ్బతిన్నది.
 
మన రాష్ట్రంలో 6.5% నిరుద్యోగ రేటు అని చెప్పడం కూడా అవాస్తవమే. కేంద్ర సర్వే సంస్థ లెక్కల ప్రకారం మన రాష్ట్ర నిరుద్యోగ రేటు (15-59 సం:) 2018-19లో 5.7% ఉంటే, 2019 -20లో 5.1%కి తగ్గింది. యనమల రామకృష్ణుడు గారు ఏ లెక్కల ప్రకారం నిరుద్యోగం 6.5% అని చెపుతున్నారో చెప్పాలని కోరుతున్నాము. ఈ విధముగా ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను తప్పు దారి పట్టించాలని, తద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలని  ప్రతిపక్ష పార్టీ కుట్రలు చేయడం  దురదృష్టకరం.
 
2020 - 21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో ఏపీకి 3వ ర్యాంకుః
మన రాష్ట్రం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సు, పేదరికం మరియు ఆర్ధిక అసమానతల్లో మెరుగుపడలేదు అంటూ ప్రతి పక్ష నాయకులు చేసిన విమర్శల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. 2018 -19 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉంటే మన రాష్ట్రం 4వ స్థానంలో ఉండేది.

అదే 2019 - 20 మరియు 2020 - 21 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్సులో మన రాష్ట్రం 3వ స్థానానికి మెరుగు పడింది. టీడీపీ హయాంలో 2018 - 19లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మన రాష్ట్రం పెరఫార్మెర్ కేటగిరీ లో ఉంటే..  ఇవాళ ఫ్రంట్ రన్నర్ కేటగిరీగా మెరుగుపడ్డాం.
 
ఎస్.డి.జి. ఇండెక్సు ప్రకారం పేదరిక నిర్ములన, అసమానతల తగ్గింపులో 5, 6 స్థానాలుః
పేదరికంలో మన రాష్ట్రాన్ని 6వ స్థానం నుండి 2వ స్థానానికి చేర్చామని ప్రతి పక్ష నాయకులు చెప్పడం కూడా పూర్తి అబద్ధమే. నీతీ ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మన రాష్ట్రం గత రెండు సంవత్సరాలలో పేదరిక నిర్మూలన ఆశయ సాధనలో 5వ స్థానంలో నిలుస్తూ  ఎస్.డి.జి మార్కులను 67 నుండి 81కి (మొత్తం 100 మార్కులకు) పెంచుకొని, పేదవారిని ఈ కరోనా కష్టకాలంలో కూడా  కాపాడుకున్నాం.

అలాగే మన రాష్ట్రంలో ఆర్ధిక అసమానత 32% నుండి 43%కి పెరిగిందని యనమల ఆరోపిస్తున్నారు, ఏ లెక్కల ప్రకారం ఇటువంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారో తెలియచేయమని కోరుతున్నాను. మీరు ఇచ్చిన సంఖ్యలు, లెక్కలకు ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక పత్రికా ప్రకటన ఇచ్చి, దానిని మీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని,  ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనుకోవడం ప్రతి పక్ష నాయకులకు తగదు.

ఇప్పటికైనా మీ తప్పుడు వాదనలు, అసత్యపు ప్రచారాలను మానుకోవాలి. ఎస్.డి.జి. ఇండెక్సులో భాగంగా 'అసమానతల తగ్గింపు' ఆశయంలో మన రాష్ట్రం 2018 -19లో 15వ స్థానంలో ఉంటే, 2020 - 21లో 6వ స్థానానికి మెరుగుపడింది.
 
ఈ విధముగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కనీస నైతిక విలువలను మరచి తప్పుడు లెక్కలు, అంకెలతో అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయాలనుకోవడం చాల బాధాకరం. ఇప్పటికైనా ప్రతి పక్ష నాయకులు ప్రజలకు నిజాలు చెప్పి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు