శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ కోసం శ్రీవారి ఆలయం దక్షిణం వైపున ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందీపోటును మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. 2008వ సంవత్సరం వరకు శ్రీవారి ఆలయంలోని బూందీ పోటులో రోజుకు 45 వేల లడ్డూలు తయారుచేయడానికి అవసరమైన బూందీ తయారుచేసేవారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బూందీపోటును ఆలయం వెలుపలకు తరలించారు. 2008లో ఇండియా సిమెంట్స్ ఎండి, టిటిడి బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ రూ.10 కోట్ల విరాళంతో నిర్మించిన బూందీ పోటును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. 40 ఎల్‌పిజి స్టౌలు ఏర్పాటు చేసి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని రోజుకు 3.75 లక్షలకు పెంచారు. ఎల్‌పిజి స్టౌల కారణంగా వచ్చే వేడి వల్ల పోటు సిబ్బంది ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన టిటిడి యాజమాన్యం నూతన బూందీ పోటు నిర్మించాలని నిర్ణయించింది.
ఇండియా సిమెంట్స్ అధినేత, ప్రస్తుత టిటిడి బోర్డు సభ్యుడు శ్రీనివాసన్ మరోసారి రూ.12 కోట్ల విరాళంతో 8,541 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన పరికరాలతో నూతన బూందీ పోటును నిర్మించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 40 థర్మిక్ ఫ్లూయిడ్ స్టౌలు, గాలి వెలుతురు బాగా వచ్చే సదుపాయం కల్పించారు. తద్వారా లడ్డూల తయారీ సామర్థ్యం రోజుకు 6 లక్షలకు పెరిగింది. పోటు సిబ్బంది సౌకర్యవంతంగా బూందీ తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, గురుమూర్తి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, తిప్పేస్వామి, దాత మరియు బోర్డు సభ్యులు శ్రీనివాసన్, ఇతర బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, మధుసూదన్ యాదవ్, ప్రశాంతి రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.