సినీ నటి భానుప్రియపై బాల కార్మిక చట్టం కింద కేసు... ఏ క్షణమైన అరెస్టు

శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:15 IST)
సీనియర్ సినీ నటి భానుప్రియపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఆమె ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి, మంచి నటిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ భానుప్రియ. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివసిస్తున్నారు. 
 
అయితే, ఆమె ఇంటి పని కోసం ఓ బాలికను నియమించుకుంది. ఆ తర్వాత ఆ బాలికపై భానుప్రియ దొంగతనం కేసు పెట్టింది. ఈ బాలిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామర్లకోటకు చెందినదికావడంతో ఈ కేసు సామర్లకోట పోలీసులు నమోదు చేశారు. అయితే, ఇపుడు ఆ కేసు చెన్నైకు బదిలీ చేశారు. ఎందుకంటే భానుప్రియ నివసిస్తున్నది చెన్నై కావడంతో కేసును కూడా ఇక్కడకు బదిలీ చేశారు. 
 
నిజానికి గత యేడాది జనవరి 19వ తేదీన చెన్నై టీ నగర్‌లోని పాండిబజార్ పోలీసులకు భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ ఇంట్లోని పని అమ్మాయి చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బాలికపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే, బాలిక తల్లి ఆ ఆరోపణలను కొట్టి పడేసింది. 
 
తన కుమార్తెను వారు ఇంట్లో నిర్బంధించి హింసిస్తున్నారని, రక్షించాలని సామర్లకోట పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న సామర్లకోట పోలీసులు చెన్నై వెళ్లి భానుప్రియను విచారించారు. మరోవైపు, చెన్నైలో భానుప్రియ పెట్టిన కేసులో ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్టు చేసి విచారించారు కూడా.
 
ఈ నేపథ్యంలో ఇపుడు ప్రభావతి పెట్టిన కేసును సామర్లకోట పోలీసులు చెన్నైకి బదిలీ చేశారు. నేరం జరిగింది చెన్నైలో కాబట్టి అక్కడి పోలీసులకు అప్పగించారు. దీంతో చెన్నై పోలీసులు భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వారిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు