చంద్రబాబుది కుల రాజకీయం: మంత్రి బొత్స

శనివారం, 26 సెప్టెంబరు 2020 (20:12 IST)
విశాఖపట్నంను పరిపాలనా రాజధాని చేస్తామంటే దానికి చంద్రబాబు అడ్డుపడుతున్నాడని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎందుకు విశాఖ అంటే చంద్రబాబుకు అంత అక్కసు అని ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమలు ఈ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. అమరావతిలోని 29 గ్రామాలు కూడా రాష్ట్రంలో అంతర్భాగమే అని మేం చెబుతూ వస్తున్నాం. కానీ చంద్రబాబు నోటి నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలన్న మాట ఎందుకు రావడం లేదు అని నిలదీశారు. 
 
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఆయన ఏమన్నారంటే...
1) విశాఖలో చంద్రబాబు సమ్మిట్‌లు పెట్టారు. పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? బీచ్ పక్కన వున్న విలువైన స్థలంను అన్యాక్రాంతం చేయాలని చంద్రబాబు ప్రయత్నించాడు. నిన్న ఉత్తరాంధ్ర గురించి నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ మనిషికి ఏదో తేడా వచ్చిందని అర్థమవుతుంది. ఎందుకంటే, విశాఖ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉండటానికి వీల్లేదని అంటున్నాడు. విశాఖలో రాజధాని పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన ఒప్పుకోవడం లేదు. 
 
2) ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులు అర్థాంతరంగా నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేయడం లేదని చంద్రబాబు బాధపడినట్లు ఈనాడులో రాశారు. ఈ విషయం మాట్లాడుతున్నది ఎవరు..? ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తాను 14 ఏళ్ళ పరిపాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్నిచేపట్టలేకపోయానని ఒప్పుకోవాల్సిందిపోయి, జగన్ గారు ఏడాదిలోనే ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నాడు. రాజకీయంగా ఇంతకుమించిన దిగజారుడు మాటలు ఉంటాయా.. ?
 
3) ఉత్తరాంధ్రకు ఆత్మాభిమానం ఉంటుందా.. ఉండదా..?  విశాఖలో రాజధాని వద్దంటున్న చంద్రబాబుతో ఉత్తరాంధ్రలో ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారంటే.. లేదా టీడీపీలో ఇంకెవరైనా మిగిలి ఉన్నారంటే.. వారందర్నీ ఉత్తరాంధ్ర వ్యతిరేకులుగానే భావించాల్సి ఉంటుంది. 
 
4) వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలం అయింది, తమ హయాంలో జరిగిన అవినీతిని నిరూపించగలిగారా.. అని చంద్రబాబు, టీడీపీ నేతలు పదే పదే సవాళ్ళు చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే మాత్రం మాపై కక్ష సాధిస్తున్నారని మళ్ళీ వీళ్ళే మాట్లాడుతున్నాడు.

అచ్చెన్నాయుడు మీద, అశోక్ గజపతిరాజు మీద కక్ష కట్టారని అంటూ, అందుకే అచ్చెన్నాయుడిని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారంటున్నారు. చంద్రబాబు మీద కోపం ఉంటే.. చంద్రబాబు మీదే కేసులు పెట్టి జైల్లో పెట్టవచ్చు కదా.. అచ్చెన్నాయుడిని పెట్టడం ఎందుకు? ఈరోజు అచ్చెన్నాయుడు వంతు వచ్చింది కాబట్టి, అతని పాపాలు బద్ధలయ్యాయి కాబట్టి కేసు పెట్టారు. రేపు చంద్రబాబు వంతు కూడా వస్తుంది.

అమరావతి రాజధానిలో  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేబినెట్ సబ్ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేలుస్తుంటే... కోర్ట్‌ల నుంచి మీ పలుకుబడితో స్టే తీసుకువచ్చారు. ఏ తప్పు చేయకపోతే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరు పెద్దలు ఎందుకు కోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్నారు. న్యాయవ్యవస్థపై విశ్వాసంతో విచారణకు ఎందుకు సిద్దం కాలేదు? 
 
5) మతం గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తే.. ఆయన సరైన స్థితిలో వుండే మాట్లాడాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హిందూ దేవాలయాల మీద దాడి చేయిస్తున్నది, బయటకు వచ్చి అరుస్తున్నదీ.. ఒక్కరే అన్న విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.

ఈ దాడుల వెనుక కుట్రదారు టిడిపి అని మేం అనుమానిస్తున్నాం. దీనిపై ఇప్పటికే ఈ దిశగా కూడా దర్యాప్తు చేయాలని డిజిపిని కోరాను. త్వరలో మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో బయటకు వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది. 

మ‌త క‌ల్లోలాలు సృష్టించి, కులాల మ‌ధ్య చిచ్చు పెట్టి, వ్య‌వ‌స్థ‌ని అస్త‌వ్య‌స్థం చేయాల‌ని తద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌న్నదే చంద్ర‌బాబు త‌ప‌న‌, ఆరాటం. చంద్రబాబు కుట్ర ఆలోచనలను తిప్పికొడతాం. కే‌సులు పెట్టి క‌క్ష తీర్చుకునే రాక్ష‌స మ‌న‌స్త‌త్వాలు చంద్ర‌బాబుకు ఉంటాయే త‌ప్ప మాకు ఉండ‌వు. చంద్ర‌బాబుకు ఉన్న ఆలోచ‌న‌లు, బుద్దులు అన్ని ఫ్యాబ్రికేటెడే. 
 
6) జగన్ మోహన్ రెడ్డిగారు సంప్రదాయ దుస్తుల్లో, అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమలలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి వస్తే..  బాబు ఏమంటున్నారు..? హిందూ దేవాలయాల దాడుల వెనుక ఏదో చీకటి ఎజెండా ఉందట. నిజమే, అయితే ఆ ఎజెండా చంద్రబాబుదేనని ఇప్పుడిప్పుడే ఆధారాలతోపాటు దొరుకుతున్నాయి. 

- ఎందుకీ చెత్త ఆరోపణలు..? మన దేశం అన్ని మతాల ఐక్యతను చాటే దేశం. భిన్నత్వంలో ఏకత్వం అన్నది వైయస్, ఆయన కుటుంబ ఆస్తి. చంద్రబాబు మాదిరిగా కులాన్ని, వర్గాన్ని నమ్ముకుని రాజకీయాల్లో ఉన్న కుటుంబం కాదు అది. చంద్రబాబు రాజకీయం అంతా కులపు రాజకీయం అయితే.. వైయస్ఆర్ కుటుంబం, జగన్ గారి రాజకీయం కులాలు, మతాలన్నింటినీ కలుపుకు వెళ్ళే రాజకీయం. కాబట్టే, 2004లో తండ్రి చేతిలో చిత్తుగా ఓడితే, 15 ఏళ్ళ తర్వాత జగన్ గారి చేతిలో చిత్తుగా ఓడాడు. ఓటమికి కారణాలు ఏమిటో చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. 
 
7) ఇక గెలవలేనన్న నిరాశ చంద్రబాబుని ఇలాంటి మాటలు మాట్లాడిస్తుంది. తనకి దక్కని అధికారం మీద బాబు పిచ్చి పుట్టినట్టు విమర్శలు చేస్తున్నాడు. ఆయనకు విలువ లేదు, ఆయన నోటికీ విలువ లేదు, ఆయన మాటకీ విలువ లేదు. అయినా, రెండు పత్రికలు, నాలుగు ఛానెళ్ళలో పొద్దున లేస్తే చాలు, ఆయన భజన వినిపించడం అన్నది ఈ రాష్ట్ర ప్రజలు తమ ఖర్మ అని భావిస్తున్నారు. 
 
8) జగన్ గారు ఏ పనిచేసినా ఒక నిబద్దత, దీర్ఘకాలిక ప్రణాళికతో, రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి చేస్తారు. దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో మనస్పూర్తిగా పాల్గొంటారు. సీయం  జ‌గ‌న్ ఏ ప‌ని అయినా నిశ్చ‌లంగా, మ‌న‌స్ఫూర్తిగా,  రాష్ట్ర ప్ర‌యోజ‌న‌ల‌ను ఆలోచించి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌తో చేస్తారు. కానీ చంద్రబాబు లోపల ఒకరకంగా, బయట ఒక రకంగా వ్యవహరిస్తారు.

గత వారం రోజుల పాటు తిరుమల డిక్లరేషన్ పై చేసిన రచ్చ వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా? ప్రజల మనోభావాలతో ఆడుకుంటారా? ఏదో ఒకటి చేసి, ప్రజలకు అవసరమైన అంశాలను వెనక్కి నెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే జగన్ గారు వీళ్ళు చేసే వివాదాలపై స్పందించడం లేదు.

చంద్రబాబు మాదిరిగా చీటికిమాటికి మైక్‌లు పట్టుకుని లేనిపోని అవకాకులు చవాకులు మాట్లాడాల్సిన అవసరం జగన్ గారికి లేదు. జగన్ గారు చెప్పింది చేయడం, ప్రతిక్షణంను ప్రజల కోసం ఆలోచించాలని కోరుకుంటారు. అందుకే ప్రతిరోజూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అధికారయంత్రాంగంతో సమీక్షలు చేస్తుంటారు. 
 
9) విశాఖ పారిశ్రామికంగా అభివృద్ది చెందిందీ అంటే దానికి కారణం ఆనాడు సీఎంగా వున్న దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు. ఐటి సిటి, ఫార్మాసిటీ, మహానగరంగా విస్తరించడంతో పాటు పలు అభివృధ్ది కార్యక్రమాలను చేపట్టారు. చంద్రబాబు అయిదేళ్ళలో చెప్పుకునేంది ఒక్క అభివృద్ధి నమూనా అయినా ఉత్తరాంధ్రకు దక్కలేదు. 
 
10) టీడీపీ హయాంలో  పంచ‌భూతాల‌ను పంచుకుతిన్నారు. ఈ రాష్ట్రంలో తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ఇన్‌సైడ్ ట్రేడింగ్ లో తమ పాత్ర లేకపోతే మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ ఎందుకు స్టే తెచ్చుకున్నారు. ఆయనతో పాటు వున్న  పెద్దలు కూడా స్టే తెచ్చకున్నారు. దీనితోనే అంతా ఆగిపోతుందని అనుకుంటే పొరపాటే.

తప్పు ఏసిన వారు ఎప్పుడూ తప్పించుకోలేరు. గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు. సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకుని తమకున్న పూర్వపరిచయాలు, పలుకుబడితో తమ అక్రమాలపై విచారణ జరగకుండా కోర్ట్‌ల్లో కేసులను  అడ్డుకుంటున్నారు. ఇక‌నైనా చంద్ర‌బాబు త‌న ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు ఆపాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు